టెస్టుల్లోకి మానవ్ సుతార్ డెబ్యూ.. ఇంతకీ ఎవరితను?

టెస్టుల్లోకి మానవ్ సుతార్ డెబ్యూ.. ఇంతకీ ఎవరితను?

IND vs AFG Test: న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్- మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తరపున యువ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ డెబ్యూ చేశాడు. ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో ఛాన్స్ దక్కించుకున్న సుతార్.. ఇండియా తరఫున టెస్టు క్రికెట్ క్యాప్ అందుకున్న 319వ ఆటగాడిగా నిలిచాడు. మరో యువ స్పిన్నింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబె కూడా డెబ్యూకు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ తుది జట్టులో సుతార్ చోటు సంపాదించాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు సీనియర్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్.. సుతార్‌కు టెస్టు క్యాప్ అందజేశాడు.

రాజస్థాన్‌కు చెందిన 23 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ సుతార్.. 2022 ఫిబ్రవరిలో ఏపీతో జరిగిన మ్యాచ్ ద్వారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి 29 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు.. 129 వికెట్లు తీసుకున్నాడు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో మానవ్ సుతార్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించాడు. బ్యాట్‌తో సెంచరీ(120) చేయడమే కాకుండా బంతితో మొత్తం 7 వికెట్లు తీసికుని టీమ్ విజయంలో కీ రోల్ పోషించాడు.

బ్యాటింగ్‌లోనూ తనదైన ముద్ర వేసిన మానవ్ సుతార్.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 945 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 25 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 34 వికెట్లు, 28 టీ20 మ్యాచ్‌ల్లో 25 వికెట్లని తన ఖాతాలో జమ చేసుకున్నాడు. చాలా కాలంగా ఇండియన్ సెలక్టర్ల దృష్టిలో ఉన్న సుతార్.. 2023 వరల్డ్ కప్‌కు ముందు నిర్వహించిన టీమిండియా ప్రిపరేటరీ క్యాంప్‌కు కూడా పిలుపు వచ్చింది. అప్పటి నుంచి అతడి ప్రదర్శనను గమనిస్తున్న సెలెక్టర్లు.. చివరకు అఫ్ఘనిస్థాన్ తో జరిగే టెస్టులో అవకాశం కల్పించారు. ఇక ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన మానవ్.. నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు వికెట్లు తీసుకున్నాడు. అదే జట్టులో ఉన్న భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి డ్రెస్సింగ్‌ రూమ్‌ను ఈ యంగ్ ఆల్‌రౌండర్ షేర్ చేసుకుంటున్నాడు.