మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొన్ని డివిజన్లకు నిధులు మంజూరు చేస్తూ, మరికొన్ని డివిజన్లపై వివక్ష చూపుతున్నారని కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు నిలదీశారు. కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ మేయర్ ధరణి మధుకర్అధ్యక్షతన గురువారం జరిగింది. డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కమిషనర్ అన్వేష్ హాజరయ్యారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు వెంకటసాయికృష్ణ, వనపర్తి కేత, అగల్ డ్యూటీ రాణి, తోటపల్లి రాజేశ్వరి, వేములపల్లి లక్ష్మీదుర్గ తదితరులు మాట్లాడుతూ తమ డివిజన్లపై మేయర్‌తో పాటు అధికారులు ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు.
‘మేము కార్పొరేటర్లుగా గెలిచి ఎనిమిది నెలలు అవుతోంది. మా డివిజన్లకు ఏం పనులు ఇస్తలేరు. ఇందిరమ్మ ఇండ్ల లిస్టు మాకు తెలవకుండనే చేసిన్రు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మాకు చెప్పకుండనే పంచిన్రు. మాకు ఎలాంటి సమాచారం ఇస్తలేరు. ఇంత అన్యాయమా?’ అని నిలదీశారు. ముగ్గురు బీజేపీ కార్పొరేటర్లు గాజుల ముఖేశ్ గౌడ్, కస్తూరి నాగరాజు, బొట్ల అనిత మాట్లాడుతూ తమ డివిజన్లలో సైతం అదే పరిస్థితి ఉందన్నారు. పార్టీలకతీతంగా కార్పొరేటర్లందరినీ సమానంగా చూడాలని, అన్ని డివిజన్లకు సమానంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
హాస్పిటల్స్ లోని మెడికల్ వేస్టేజ్‌ను గోదావరిలో డంపు చేయడం వల్ల నది కలుషితమవుతోందని 45వ డివిజన్ కార్పొరేటర్ ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత ఏజెన్సీ పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని డివిజన్లలో చెత్తబండ్లు నాలుగైదు రోజులకు ఒకసారి వస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అంతకుముందు డబుల్ బెడ్ రూమ్ లు, ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చి ఆందోళన చేశారు. కాగా, ముందెన్నడూ లేనివిధంగా వంద మందికి పైగా పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.
