తెలంగాణ చరిత్ర : డైనోసార్లు తిరిగిన నేల.. దశావతారాలు పొదిగిన కోన.. వేమనపల్లి వింతలు, విశేషాలు

తెలంగాణ చరిత్ర : డైనోసార్లు తిరిగిన నేల.. దశావతారాలు పొదిగిన కోన..  వేమనపల్లి వింతలు, విశేషాలు

నదీ తీరాన ఏర్పడిన ఆ ప్రాంతం ఎన్నో వింతలు, విశేషాలను కలబోసుకుంది. ప్రాణహిత నదీ పరవళ్లు, ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, విలువైన వృక్ష సంపద, రాక్షస బల్లుల అవశేషాలు... ఇలా ఎన్నింటినో తన ఒడిలో పదిలపర్చుకుంది. బెల్లంపల్లి దగ్గర్లోని ఆ ప్రాంతమే వేమనపల్లి, ప్రకృతి ఒడిలో అలరారుతున్న ఆ ప్రాంతంపై ప్రత్యేక కథనం.

ఉత్తర తెలంగాణలో మరే ప్రాంతంలో కనిపించని నారేప చెట్లు వేమనపల్లి మండలంలో కనిపిస్తాయి. రాజారం, మంగినపల్లి, కల్లెంపల్లి, వేమనపల్లి, నీల్వాయి, జాజులపేట, ఒడ్డుగూడెం తదితర అటవీ ప్రాంతాల్లో ఈ చెట్లు విస్తారంగా పెరిగాయి. కర్ణాటక, వేములవాడ, సిరిసిల్ల, నిజామాబాద్, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి ధ్వజస్తంభాల కర్ర కోసం ఇక్కడికి వచ్చి నారాప చెట్లను తీసుకెళ్తుంటారు.

డైనోసార్లు తిరిగిన నేల

కొన్ని వందల ఏళ్ల క్రితం ఇక్కడ డైనోసార్లు(రాక్షస బల్లులు) సంచరించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. 1984లో మంగెనపల్లి అటవీ ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో 14 మీటర్ల పొడవు, 5.5 మీటర్ల ఎత్తున్న డైనోసార్ అవశేషాలు దొరికాయి. ప్రాణహిత నదీపరివాహక ప్రాంతంలోని సుంపుటం, ఒడ్డుగూడెం, మంగెనపల్లి తదితర ప్రాంతాల్లో రాక్షస బల్లుల అవశేషాలు ఉన్నట్లు తెలుస్తోంది. వేమనపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో 50 మీటర్ల వెడల్పు గొయ్యి (సొరంగం) ఉంది. దీన్ని రాకాసి కోన అని పిలుస్తారు.

వృక్ష శిలాజాలు కోకొల్లలు

ఈ ప్రాంతంలో ఒడ్డుగూడెం, సుంపుటం, వేమనపల్లి తదితర ప్రాంతాల్లోని వాగులు, వంకల్లో ఎక్కడ పడితే అక్కడ వృక్ష శిలాజాలు దర్శనమిస్తాయి. చేప, నత్తగుల్ల, తాబేలు ఆకారపు శిలాజాలు భూగర్భంలో కలిసిపోయి ఉన్నాయి. కొన్ని వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతం దట్టమైన అటవీ సంపదతో ఉండేదట. కాలక్రమేణా భారీ వర్షాలు కురిసి ప్రాణహిత ఉప్పొంగి, మహావృక్షాలు నేలమట్టమై ఇసుక పొరలతో కప్పబడ్డాయి. దాంతో ఈ చెట్లు కొన్ని వందల ఏళ్ల తర్వాత శిలాజాలుగా మారాయి.

దశావతారాలు

రాజారం గ్రామంలో కొలువైన దశావతారాల విగ్రహాలు చరిత్రకు తార్కాణాలు. సుమారు 12వ శతాబ్దంలో కాకతీయ రాజుల కాలంలో వీటి ప్రతిష్ఠాపన జరిగినట్లు తెలుస్తోంది. కాకతీయ రాజుల వద్ద సామంతరాజులుగా పని చేసిన వేమన్న, నాగన్న, సూరన్న, బ్రహ్మన్న అనే నలుగురు అన్నదమ్ములు దశావతారాల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ప్రాణహిత నదీపరివాహక ప్రాంతానికి చేరువలో ఉన్న రాజారంలో శ్రీకృష్ణుడు, కాలభైరవుడు, గౌతమబుద్ధుడు, శ్రీరాముడు, సీతమ్మ, ఆంజనేయస్వామి, పరశురాముడు, మహాగణపతి, కాళింగవర్ధనుడు, కూర్మావతార విగ్రహాలను ప్రతిష్ఠించారు.

 సుమారు 800 ఏండ్ల క్రితం ప్రాణహిత నది ఉప్పొంగి, భారీ ప్రాణనష్టం జరిగింది. అప్పటికే దశావతారాల కోసం గుడి కట్టడానికి అన్నీ రెడీ చేసుకున్నా.. ఆ యత్నాన్ని సామంత రాజులు విరమించుకున్నారు. అలా ఊరి చివర అరుబయటనే ఉండిపోయాయి ఆ విగ్రహాలు.

అన్నదమ్ముల పేరిట...

కాకతీయ రాజుల వద్ద సామంతరాజులుగా పని చేసిన నలుగురు అన్నదమ్ములు ఆ కాలంలోనే ప్రాణహిత నది వ్యవసాయం ఎంత గొప్పదనేది గుర్తించారు. ఒక్కొక్కరు ఒక్కో గ్రామాన్ని ఏలి పంటలు సాగు చేసేందుకు పెద్ద, పెద్ద చెరువులు కట్టారు. వేమనపల్లి, నాగారాం. సూరారం, బొమ్మెన గ్రామాల్లో ఇప్పటికీ సామంతరాజులు నిర్మించిన చెరువులు చెక్కు చెదరలేదు. వీటి కింద వందల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. ఆ సామంతరాజుల జ్ఞాపకార్థంగా వేమన్న పేరుతో వేమనపల్లి, నాగన్న పేరుతో నాగారం, సూరన్న పేరుతో సూరారం, బ్రహ్మన్న పేరుతో బొమ్మెన గ్రామాలు ఏర్పడ్డాయని పెద్దలు చెబుతారు.

దక్షిణం నుంచి ఉత్తరానికి

వేమనపల్లి శివారులోని మహారాష్ట్ర సరిహద్దున ప్రాణహిత నది ప్రవహిస్తుంది. నది ఒడ్డున. ఏపుగా ఎదిగిన పచ్చని చెట్లు, ప్రకృతి సోయగాలు ఆకట్టుకుంటాయి. ప్రాణహితను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు పడవ ప్రయాణం చేయందే వెళ్లరు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా, ఏ కాలంలోనైనా ఈ నది నిండుగా ప్రవహిస్తుంది. ప్రాణహిత నదీప్రవాహం దక్షిణం నుంచి ఉత్తరంకు పారుతుంది. ఈ నది మాదిరిగా మరెక్కడా ఏ నదీ ప్రవహించదు. 

ప్రతియేటా కార్తీక మాసం రోజున భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పుణ్య స్నానాలు చేస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ తదితర ప్రాంతాల నుంచి ముఖ్యమైన పర్వదినాల్లో వచ్చి పుణ్య స్నానాలు చేస్తారు.

--దాసరి పృథ్వీ
బెల్లంపల్లి రూరల్