ప్రభుత్వానికి మావోయిస్టుల లేఖ..వరద బాధితులను ఆదుకోవాలి..లేదంటే

ప్రభుత్వానికి మావోయిస్టుల లేఖ..వరద బాధితులను ఆదుకోవాలి..లేదంటే

తెలంగాణ ప్రభుత్వానికి మావోయిస్టులు లేఖ రాశారు. రాష్ట్రంలో వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని  మావోయిస్టు జేఎండబ్ల్యూపీ  డివిజన్ కమిటీ  డిమాండ్ చేసింది.  ముఖ్యంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరదల కారణంగా వేలాది మంది నిరాశ్రయులు అయ్యారని..వారందరిని ప్రభుత్వమే ఆదుకోవాలని లేఖలో స్పష్టం చేశారు. ఈ మేరకు పలు డిమాండ్లతో లేఖ విడుదల చేశారు. 


మావోల లేఖలోని ప్రధాన అంశాలు :

  • అంత్యంత భారీ వర్షంతో కొండాయి, మోరంచపల్లి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాల్లో చనిపోయిన వారందరికీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కొక్కరికి ఒక ఇల్లు, 10 లక్షల రూపాయలు వెంటనే చెల్లించాలి.
  • జూలై 27న వచ్చిన అంత్యంత భారీ వర్షంతో ములుగు, భూపాలపల్లి జిల్లాలను అతలాకుతలం చేసింది. భారీ వర్షాలతో వరదలు వచ్చి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తూ కుంటలు, చెరువులు తెగిపోయాయి. దీంతో కొండాయి, దొండ్ల, మల్యాల, ప్రాజెక్టునగర్, బూర్గుపేట, మోరంచపల్లితో సహా చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాల్లోని ప్రజలంతా అర్తనాదాలు, అహాకారాలు, అరణ్యరోదనలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటు గడిపారు 
  • కొండాయిలో 8మంది, మోరంచపల్లిలో నలుగురు, ప్రాజెక్టు నగర్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, బూర్గుపేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో  సహా లెక్కలోకి రానివారు మరికొందరు వరదలో కొట్టుకుపోయి చనిపోయారు.
  • బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ప్రచార ఆర్భాటాలు చేసింది కానీ ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బాధ్యతారహితంగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. 
  • భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50 వేలు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. 
  • ఈ వరదలతో తెగిన కుంటలను, చెరువులను వెంటనే పునరుద్ధరించాలి
  • జంపన్న వాగు,మోరంచ వాగు, చలివాగుపాటు అనేక వాగులు పక్కన ఉన్న పంటపొలాల్లో వేసిన ఇసుక మేటలను తీయడానికి ప్రభుత్వమే ఎకరాకు ఒక లక్ష రూపాయలు  వెంటనే ఇవ్వాలి.
  • వరదలకు తెగిన రోడ్లను, వంతెనలను వెంటనే పునరుద్ధరించాలి
  • వర్షాలతో వాతావరణం కలుషితమై జనాలు రోగాల బారిన పడే అవకాశం ఉంది.  మలేరియాతో పాటు అన్ని రకాల జబ్బులకు వెంటనే మెడికల్ క్యాంపులు పెట్టి వైద్యం అందించాలి
  • మరో పంట కోసం అన్ని రకాల విత్తనాలను ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి