- ఉగ్ర మూలాలను ఏరివేయడంలో భారత్‌కు మద్దతిస్తాం
- ప్రపంచ శాంతికి టెర్రరిజం పెద్ద ముప్పు
- భారత్, పాక్ యుద్ధాన్ని మేం కోరుకోవట్లేదు
- చమురు కోసం ఒకే దేశంపై ఆధారపడటం ప్రమాదమని వెల్లడి
ముంబై: టెర్రరిజం విషయంలో భారత్, అమెరికా దేశాల ఆందోళనలు ఒకేలా ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఉగ్రవాదం అనేది కేవలం ఒక్క దేశానికే సంబంధించిన సమస్య కాదని, అది ప్రపంచ శాంతికి, మానవాళి మొత్తానికి ముప్పేనని పేర్కొన్నారు. ఉగ్రవాద మూలాలను ఏరివేయడంలో, ఉగ్రవాద సంస్థలను అణచివేయడంలో భారత్, అమెరికా ఒకే రకమైన దృక్పథాన్ని కలిగి ఉన్నాయని చెప్పారు.
భారత్‌ను వేధిస్తున్న ఉగ్రవాద సమస్య పట్ల అమెరికాకు పూర్తి అవగాహన ఉందని, ఈ విషయంలో భారత్ ఆందోళనలకు అమెరికా మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఒసామా బిన్ లాడెన్ హతం, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్), అల్-ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలపై అమెరికా సాగించిన పోరాటాలను ఆయన గుర్తుచేశారు. గురువారం రూబియో ముంబైలోని తాజ్ హోటల్‌లో ఓ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆఫ్రికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని, తీవ్రవాద భావజాలాన్ని రూపుమాపేందుకు అమెరికా కట్టుబడి ఉందని, భారత్‌తో కలిసి ఉగ్రవాద మూలాలను అంతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
అన్ని దేశాలతో చర్చలు అమెరికా బాధ్యత
అన్ని దేశాలతోనూ చర్చలు జరపాల్సిన బాధ్యత అమెరికాపై ఉందని, పాకిస్తాన్‌తో చర్చలు జరపడం వల్ల ఆ దేశం తీసుకునే నిర్ణయాలపై కొంత పట్టు సాధించవచ్చని రూబియో అభిప్రాయపడ్డారు. భారత్‌తో ఉన్న వ్యూహాత్మక సంబంధాలను దెబ్బతీసేలా తాము పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాలు కొనసాగించబోమని మరోసారి స్పష్టంచేశారు. ఏ దేశంతోనూ అమెరికాకు ఉండే దౌత్య సంబంధాలు భారత్‌తో ఉన్న బంధానికి నష్టం కలిగించే విధంగా ఉండవని తేల్చిచెప్పారు.
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగాలని అమెరికా కోరుకోవట్లేదని.. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడంలో, ఉద్రిక్తతలను తగ్గించడంలో అమెరికా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని తెలిపారు. యుద్ధాల వల్ల నష్టం తప్ప ఒరిగేదేమీ లేదని, బదులుగా ఇరు దేశాలు వ్యాపార, వాణిజ్య అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రత్యామ్నాయాలపై బెదిరింపుల ప్రభావం లేదు
భారత్ తన అవసరాలను దృష్టిలో ఉంచుకునే ముడి చమురు దిగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటోందే తప్ప అమెరికా బెదిరింపుల వల్ల కాదని రూబియో స్పష్టం చేశారు. ముడి చమురు విషయంలో ఒకే దేశంపై ఎక్కువగా ఆధారపడటం వల్ల భవిష్యత్తులో సరఫరా అంతరాయాలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై గతంలో ట్రంప్ ప్రభుత్వం అదనపు సుంకాలు విధించినప్పటికీ, భారత్ తన సరఫరా నెట్‌వర్క్‌ను అనేక దేశాలకు విస్తరించుకుంటూ వస్తోందని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో భారత్, అమెరికా మధ్య ఇంధన సహకారం మరింత బలపడుతుందని రూబియో ధీమా వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ బంధం చాలా ముఖ్యమైనదని, భవిష్యత్తులో ఇది మరింత ముందుకు వెళ్తుందని ఆయన పేర్కొన్నారు.
