SBI బ్యాంక్‌కు సైబర్ దెబ్బ: 3.75 లక్షల మంది డేటా లీక్ చేసిన హ్యాకర్లు!

SBI బ్యాంక్‌కు సైబర్ దెబ్బ: 3.75 లక్షల మంది డేటా లీక్ చేసిన హ్యాకర్లు!

దేశంలోని కోట్లాది ప్రజల నమ్మకానికి ప్రతీకగా నిలిచే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భద్రతకు సంబంధించి ఓ సంచలన వార్త కస్టమర్లను కుదిపేస్తోంది. 'సిరియూసిమ్' అనే హ్యాకర్ గ్రూప్ SBIకి చెందిన దాదాపు 3.75 లక్షల మంది కస్టమర్ల సీక్రెట్ డేటాను దొంగిలించినట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ ఎకౌంట్ 'సైబర్‌పల్స్56' ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ హ్యాకర్ల దగ్గర సుమారు 3లక్షల 75వేల అకౌంట్లకు సంబంధించిన వివరాలతో పాటు 2వేల722 పీడీఎఫ్ ఫైల్స్ ఉన్నట్లు సమాచారం.

ఈ డేటా లీక్‌లో ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం, లోన్ అప్లికేషన్లు, వాటికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్, అకౌంట్ ఓపెనింగ్ దరఖాస్తులు, చిరునామాలు వంటి అత్యంత కీలకమైన వివరాలు ఉన్నట్లు సైబర్‌పల్స్56 తెలిపింది. ఇది ఈ డేటాకు సంబంధించి మొదటి లీక్ మాత్రమేనని హ్యాకర్లు పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ లీకైన డేటా ఎంతవరకు నిజం, దీని మూలాలు ఎక్కడివి అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ ఈ సమాచారం గనుక నిజమైతే, సైబర్ నేరగాళ్లు దీనిని ఉపయోగించి మోసపూరిత లోన్ దరఖాస్తులు చేయడం, ఐడెంటిటీ థెఫ్ట్, ఆర్థిక మోసాలు, టార్గెటెడ్ ఫిషింగ్ దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ భారీ డేటా లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నప్పటికీ.. ఇప్పటి వరకు SBI వర్గాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. బ్యాంక్ నుంచి అధికారిక ప్రకటన వెలువడితేనే దీనికి సంబంధించిన వాస్తవాలు, కస్టమర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది స్పష్టమయ్యే అవకాశం ఉంది. డిజిటల్ బ్యాంకింగ్ రోజురోజుకూ పెరుగుతున్న వేళ ఈ తరహా సైబర్ దాడులు ఖాతాదారులను కలవరపెడుతున్నాయి.