- సెప్టెంబర్ 1 మధ్యాహ్నం 12 గంటల వరకు అవకాశం
- 693 మార్కులతో మెరిట్ లిస్ట్ లో సాయి గాయత్రి టాప్
- మొత్తం 63 కాలేజీల్లో సీట్ల భర్తీకి సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్
- ఫేజ్-1లో ఆప్షన్లు వివ్వకుంటే తదుపరి రౌండ్లకు నో చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ప్రక్రియను వేగవంతం చేసింది. 2026–-27 విద్యాసంవత్సరానికి సంబంధించి కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ప్రవేశాల కోసం నోటిఫికేషన్ తోపాటు, ఫైనల్ మెరిట్ లిస్ట్, సీట్ మ్యాట్రిక్స్ ను శుక్రవారం విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ అన్- ఎయిడెడ్ నాన్- మైనారిటీ, మైనారిటీ మెడికల్ కాలేజీల్లోని సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు నేడు(శనివారం) ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 1 మధ్యాహ్నం 12 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
18,602 మందితో మెరిట్ లిస్ట్..
నీట్ యూజీ స్కోరు ఆధారంగా వర్సిటీ విడుదల చేసిన ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మొత్తం 18,602 మంది అభ్యర్థులకు చోటు దక్కింది. ఇందులో కొంపెల్ల సాయిగాయత్రి తేజోఅరుణిమ 693 మార్కులతో మొదటి స్థానంలో నిలవగా, దేవేష్ శ్రీగోపాల్ అగర్వాల్ (690), మామిడి చైతన్య (686) తర్వాతి స్థానాల్లో నిలిచారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయి, ఫైనల్ మెరిట్ లిస్ట్ లో పేరున్న వారు మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అర్హులు. అభ్యర్థులు https://tsmedadm.tsche.in/ వెబ్ సైట్ ద్వారా తమకు నచ్చిన కాలేజీలకు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
63 కాలేజీలతో సీట్ మాట్రిక్స్..
కౌన్సెలింగ్ కోసం వర్సిటీ మొత్తం 63 మెడికల్ కాలేజీల లిస్ట్‌ను ప్రకటించింది. ఇందులో గాంధీ, ఉస్మానియా, కాకతీయ వంటి ప్రభుత్వ కాలేజీలతోపాటు పలు ప్రైవేట్ కళాశాలు కూడా ఉన్నాయి. కేటగిరీలవారీగా పురుషులు, మహిళలకు కేటాయించిన సీట్ల వివరాలను సీట్ మ్యాట్రిక్స్ లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ , క్యాప్, పీఎంసీ కోటా సీట్ల వివరాలను కూడా వెల్లడించారు. మైనారిటీ కాలేజీల్లోని సీట్లను కేవలం ముస్లిం అభ్యర్థులకు మాత్రమే కేటాయిస్తారు.
సందేహాల కోసం హెల్ప్ లైన్..
కౌన్సెలింగ్ ప్రక్రియలో సందేహాల నివృత్తికి వర్సిటీ హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. నిబంధనల కోసం 7901098840, టెక్నికల్ ఇష్యూస్ కోసం 9392685856, ఫీజు చెల్లింపు సమస్యల కోసం 9618240276 నంబర్లను అభ్యర్థులు సంప్రదించవచ్చు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సందేహాలకు 9866092370 నంబర్ ను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే tsmedadm.tech@gmail.com కు మెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
ఫేజ్-1లో ఆప్షన్లు ఇచ్చుకోకుంటే తదుపరి రౌండ్లకు నో చాన్స్..
సీట్ల బ్లాకింగ్ ను అరికట్టేందుకు వర్సిటీ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. మొదటి విడత కౌన్సెలింగ్ లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోని అభ్యర్థులకు తదుపరి విడత కౌన్సెలింగ్ లో పాల్గొనే అవకాశం ఉండదు. అదేవిధంగా వెబ్ ఆప్షన్ల ద్వారా సీటు కేటాయించిన తర్వాత సదరు కాలేజీలో చేరని పక్షంలో, ఆ అభ్యర్థులు తర్వాతి రౌండ్లకు అనర్హులుగా పరిగణించబడతారు.
సీటు పొందిన విద్యార్థులు రూ.12 వేలు యూనివర్సిటీ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఒకసారి చెల్లించిన యూనివర్సిటీ ఫీజు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వబడదు. ట్యూషన్ ఫీజును సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేసే సమయంలో చెల్లించాల్సి ఉంటుంది.
