- మృతులు వరుసకు తల్లీకూతుళ్లు
- నీట మునిగిన మరో ఇద్దరు అమ్మాయిలు సురక్షితం
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడిచన్పల్లిలో విషాదం చోటుచేసుకుంది. మంజీర నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు. మృతుల్లో 35 ఏళ్ల మహిళతోపాటు పదహారేళ్ల పదో తరగతి విద్యార్థిని ఉన్నారు. ప్రమాద సమయంలో నదిలో ఉన్న మరో ఇద్దరు అమ్మాయిలను కుటుంబ సభ్యులు సురక్షితంగా కాపాడారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది.వివరాల్లోకి వెళితే..
మంజీర నదిలో మునిగి వరుసకు తల్లీ కూతుళ్లు అయిన ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు అమ్మాయిలు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని పొడిచన్పల్లి శివారులో శుక్రవారం జరిగింది. బాధిత కుటుంబీకుల ప్రకారం.. మండల పరిధిలోని చీకోడ్ గ్రామానికి చెందిన మంజుల (35) పొడిచన్పల్లిలోని తన అక్క స్వప్న వద్దకు వచ్చింది. ఈ క్రమంలో మంజుల, స్వప్నతోపాటు స్వప్న ఇద్దరు కూతుళ్లు, వారి ఆడ బిడ్డ కూతురు కలిసి మంజీర తీరంలో ఉన్న వారి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. అక్కడ నదిలో గల చెక్ డ్యాం వద్ద మంజుల, స్వప్న ఆమె ఇద్దరు కూతుళ్లు, కోడలు స్నానం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పోయారు. ఇది గమనించి ఒడ్డున ఉన్న స్వప్న భర్త కపిల్ తన కూతురు శృతితో పాటు కోడలు శివానిని రక్షించగా... మంజులతో పాటు, స్వప్న కూతురు స్పూర్తి (16) నీటిలో మునిగి చనిపోయారు.
మృతి చెందిన స్ఫూర్తి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి చదువుతుంది. మృతుల కుటుబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
