మెదక్/ సంగారెడ్డి, వెలుగు: ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి మెదక్ జిల్లా నోడల్ ఆఫీసర్ వాణి ప్రసాద్ ఆఫీసర్లను ఆదేశించారు. తాగునీటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, నీటి వృథాను అరికట్టి పొదుపుగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంటలో అడిషనల్ కలెక్టర్ టి.ఎల్. సంగీతతో కలిసి ఆమె పర్యటించారు.
పత్తి, కంది, టమాట పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి పొలంలో ఫామ్ పాండ్స్ నిర్మించుకునేలా రైతులను ప్రోత్సహించాలని ఆఫీసర్లకు సూచించారు. వీబీ-జీ రామ్జీ పథకం పనిదినాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు అవసరమైన చోట పంట విరామం పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. గుమ్మడిదల తహసీల్దార్ ఆఫీస్లో సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. సమావేశంలో సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల అడిషనల్ కలెక్టర్లు సంగీత, లక్ష్మీకిరణ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
