ఆసిఫాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులపై అలర్ట్ .. ప్రభుత్వ దవాఖానాల్లో మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు

ఆసిఫాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులపై అలర్ట్ .. ప్రభుత్వ దవాఖానాల్లో మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు
  • దోమలు, లార్వాల నివారణకు లిక్విడ్లు
  • ప్రజల్లో విస్తృత అవగాహనకు ప్రత్యేక కార్యక్రమాలు

ఆసిఫాబాద్, వెలుగు: సీజనల్‌ వ్యాధుల నివారణకు ఆసిఫాబాద్ ​జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. ఈ ఏడాది ముందుగానే వర్షాలు పడడంతో వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్న యాంత్రాంగం.. వ్యాధులు సోకకముందే నివారణ చర్యలు తీసుకుంటోంది. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీల్లో వైద్య సిబ్బంది ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని పల్లె జనాలను అప్రమత్తం చేస్తున్నారు. 

ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలపై దృష్టిపెట్టారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, నీటి కాలుష్యం నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. వ్యాధులు ప్రబలినప్పుడు తక్షణం గుర్తించేందుకు మలేరియా ర్యాపిడ్‌ డయాగ్నస్టిక్‌ కిట్లు, దోమలు వృద్ధి చెందకుండా వాటి లార్వాల నివారణకు స్ప్రే, లిక్విడ్స్‌ అందజేస్తున్నారు. గ్రామాలతోపాటు, పట్టణాల్లోని వార్డుల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.

 గ్రామాలు, వార్డుల్లో పర్యటిస్తూ సూచనలు

జూన్‌ నెలను మలేరియా మాసంగా, జూలైని డెంగ్యూ నెలగా గుర్తించిన అధికారులు.. ప్రజలను చైతన్యం చేస్తూ అన్ని గ్రామాల్లో దోమల నివారణకు చర్యలు చేపడుతున్నారు. వాటర్‌ ట్యాంక్‌లు, బోరు బావులు కలుషితం కాకుండా క్లోరినేషన్‌ చేస్తున్నారు. దోమలు, లార్వా నివారణకు టెమిఫోస్‌, పెరిత్రమ్‌ లిక్విడ్‌ స్ప్రే చేస్తున్నారు. జూలైలో డెంగ్యూ ప్రబలే అవకాశం ఉండడంతో గ్రామాలు, వార్డుల్లో అధికారులు పర్యటిస్తూ నివారణ చర్యలు సూచిస్తున్నారు. 

అనుమానితుల రక్తనమూనాలను సేకరించి టీ హబ్‌కు పంపిస్తున్నారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా నివారణతోపాటు గర్భిణుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. దోమల నిర్మూలనకు అంగన్‌వాడీ, ఆశాలు, ఏఎన్‌ఎంలు, మున్సిపల్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నరు. జిల్లాలో తాజాగా గుర్తించి 67 మలేరియా ప్రభావిత, గతేడాది ప్రబలిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు. 

సీజనల్‌ వ్యాధుల నివారణ పద్ధతులు

  •  గుంతలు, లోతట్టు ప్రాంతాలు, పడావుబడిన బావులను పూడ్చి నీరు నిల్వకుండా చూడడం.
  •  చెత్తాచెదారం, మురుగు కాల్వలో చేరకుండా చూడాలి. మురుగు కాల్వల్లో పూడిక తీసి నీరు పారేలా చూడాలి.
  •   కంపచెట్లు, పిచ్చిమొక్కలను తొలగించి మరుగుదొడ్లు, గాలిగొట్టాలకు మెష్​ కట్టించాలి.
  •   దోమ తెరలు వాడాలి. కిటికీలకు తీగలు, లేదా నైలాన్‌ వలలు అమర్చుకోవాలి.
  •   నీరు నిల్వ చేసే డ్రమ్ములు, కుంటలను వారానికి ఒకసారి ఖాళీ చేయాలి.
  •   ఇంటి పరిసరాల్లో పనికిరాని డబ్బాలు, పగిలిన సీసాలు, కుండ పెంకులు, కొబ్బరి చిప్పలు, టైర్లు, నీరు నిల్వ ఉండే ఇతర వస్తువులను తొలగించాలి.

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు

జిల్లాలో గతంలో వచ్చిన విషజ్వరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. గూడేలు, తండాలతోపాటు పట్టణాల్లో వ్యాధుల ప్రభావం కనిపిస్తే వెంటనే హెల్త్‌ క్యాంపులు నిర్వహించడం, రక్తనమూనాలు సేకరించేలా కార్యాచరణతో ముందుకు పోతున్నం. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రైతులు, కూలీలు వాగులు, వంకల్లో నీరు తాగొద్దు. స్వచ్ఛమైన నీటిని తాగాలి. ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే సమీపంలోని దవాఖానకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి. అన్ని రకాల మందులు, ఓఆర్ ఎస్ ప్యాకెట్లు ప్రతి హాస్పిటల్​ అందుబాటులో ఉంచాం.

కుంరం సీతారాం, డీఎంహెచ్ వో, ఆసిఫాబాద్