- దేవాదుల, సీతారామ కనిపించడం లేదా
- తప్పుడు ప్రచారంతో ఏం సాధిస్తారు?
- కేటీఆర్ పై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ దాటిన తర్వాత గోదావరి నేరుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించదని, తెలంగాణలో భద్రాచలం వరకు ప్రవహిస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఈలోగా ఇంద్రావతి, శబరి నీళ్లు కూడా కలుస్తాయని పేర్కొన్నారు. దిగువ గోదావరి ప్రవాహాన్ని వినియోగించుకునే పథకాలతో వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీరు అందుతోందని స్పష్టం చేశారు.
మేడిగడ్డ దిగువనే దేవాదుల, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా నీటిని వినియోగిస్తున్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగా ఆంధ్రాకు నీళ్లు వెళ్తున్నాయని కేటీఆర్ విమర్శలు చేస్తున్నారనిన ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఈ నెల 25న సాయంత్రం 6 గంటలకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహం 17,900 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం 85 గేట్లు తెరిచి ఉన్నాయి. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో సమానంగా ఉన్నాయి. నది ఫ్రీ ఫ్లో పరిస్థితిలో ప్రవహిస్తోంది’ అని సత్యం వివరించారు.
ఈ నీరంతా ఏపీకి వృథాగా పోతోందని కేటీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ అర్థరహితంగా ఆరోపిస్తున్నాయని మండిపడ్డారు. తప్పుడు ప్రచారంతో ఏం సాధిస్తారని ఫైర్అయ్యారు. గోదావరిలో ప్రవాహం ఉండటం వేరు, ఆ నీటిని ఎత్తిపోయేందుకు అవసరమైన కనీస నీటిమట్టం ఉండటం వేరని చెప్పారు. కన్నెపల్లి లక్ష్మీ పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తాలంటే మేడిగడ్డ వద్ద కనీసం +93.50 మీటర్ల నీటిమట్టం అవసరమని, కానీ ప్రస్తుతం ఉన్నది +89.20 మీటర్లేనని అన్నారు.
పంపింగ్‌కు అవసరమైన స్థాయి కంటే 4.30 మీటర్లు తక్కువ ఉండటంతో అసలు పంపులు నడవవని తేల్చి చెప్పారు. కాళేశ్వరం ఒక్క మేడిగడ్డతో ముగిసే ప్రాజెక్టు కాదని.. కన్నెపల్లి నుంచి ఎత్తిన నీటిని అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లికి తరలించాల్సి ఉంటుందని తెలిపారు. మూడు బ్యారేజీల్లో మరమ్మతులు పూర్తి చేసి భద్రతా అనుమతులు పొందకముందే గేట్లు మూసి నీటిని నిల్వ చేయడం ప్రమాదకరమని ఎన్డీఎస్‌ఏ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో గేట్లు మూసి నీటిని నిల్వ చేయడం కుదరని పని అని సత్యం స్పష్టంచేశారు.
