విద్యుత్‌‌‌‌ దోపిడీ బయటపడుతుందనే అడ్డగోలు మాటలు : విప్ వేముల వీరేశం

విద్యుత్‌‌‌‌ దోపిడీ బయటపడుతుందనే అడ్డగోలు మాటలు : విప్ వేముల వీరేశం
  • బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌పై విప్ వేముల వీరేశం ఫైర్‌‌‌‌‌‌‌‌ 

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ పాలనలో చేసిన విద్యుత్ విధ్వంసం, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారని విప్ వేముల వీరేశం మండిపడ్డారు. విద్యుత్ శాఖలో జరిగిన దోపిడీ ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే సీఎం రేవంత్ రెడ్డిపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. ఆదివారం సీఎల్పీ మీడియా సెంటర్‌‌‌‌లో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.

జగదీశ్ రెడ్డి అణువణువునా విషమేనని, ఆయన నల్గొండ జిల్లాకు పట్టిన శాపమని ఫైర్ అయ్యారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అంచనాలు పెంచి, విదేశీ బొగ్గు దిగుమతి పేరిట ఓ ప్రైవేట్ కంపెనీకి రూ.లక్ష కోట్లు దోచిపెట్టే ప్రయత్నం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. మార్కెట్‌‌‌‌లో చవకగా కరెంట్ దొరుకుతున్నా.. చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌తో ఎక్కువ ధరకు ఒప్పందం చేసుకున్న లోపాయికారీ బాగోతం వెనుక ఉన్న కమీషన్ల గుట్టు ఏమిటి అని నిలదీశారు.

గతంలో 14 వేల మెగావాట్లకు మించి విద్యుత్ ఇవ్వలేని బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్ ప్రభుత్వం 20 వేల మెగావాట్ల రికార్డు డిమాండ్‌‌‌‌ను తట్టుకుని రైతులకు సరఫరా చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. కుంభం అనిల్ కుమార్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ.. రూ.30 వేల కోట్ల ప్రాజెక్టును రూ.లక్ష కోట్లకు తీసుకెళ్లి కట్టిన కాళేశ్వరాన్ని బీఆర్ఎస్ నేతలు కూలేశ్వరం చేశారని విమర్శించారు.

బ్యారేజీలో నీళ్లు నిల్వ చేయొద్దని ఎన్డీఎస్ఏ చెప్పినా, కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలంటూ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌‌‌‌నినో వల్ల వచ్చిన కరువు పరిస్థితులను రాజకీయం చేయడం బీఆర్ఎస్ నేతల దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.