సమంత ఆరోగ్యం పై చిరంజీవి ట్వీట్

సమంత ఆరోగ్యం పై చిరంజీవి ట్వీట్

సామ్ నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ నటి సమంతను ఉద్దేశిస్తూ.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. " డియర్ సామ్.. కాలానికి అనుగుణంగా మన జీవితాల్లో ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. వాటి వలన మనకు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో తెలుస్తుంది. మనోబలం కలిగిన అద్భుతమైన అమ్మాయివి నువ్వు. అతి త్వరలో నువ్వు అనారోగ్యం నుంచి కోలుకుని వస్తావని నాకు నమ్మకం ఉంది" అంటూ చిరంజీవి తన ట్వీట్ లో రాశారు.  సమంత పట్ల తనకు ఉన్న  ప్రేమను ఆయన తెలియజేశారు. ఆమెలో ధైర్యం నింపేలా మయోసైటిస్ వ్యాధి నుంచి.. సామ్ త్వరగా కోలుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు. 

ఇదిలా ఉండగా.. తాను మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత నిన్న తన ట్విటర్ ద్వారా తెలియజేశారు.  ప్రస్తుతం తాను చికిత్స తీసుకుంటున్నానని, త్వరలో దీని నుంచి కోలుకుంటానని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సినీ నటులంతా ఆమెలో ఆత్మస్థైర్యం నింపేలా పోస్టులు పెడుతున్నారు. ఆమె ఈ పోస్టును షేర్ చేసిన వెంటనే.. అఖిల్ అక్కినేని మీకు అందరి ప్రేమ, బలం తోడుగా ఉన్నాయని ట్వీట్ చేశారు. మరోవైపు శ్రియా శరణ్ స్పందిస్తూ.. మీ పై ఎంతో ప్రేమ ఉంది.. మీరు ఎల్లప్పుడూ అద్భుతంగా ఉంటారని అన్నారు. మరోవైపు.. సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద వచ్చే నెల (నవంబర్ 11న) ప్రేక్షకుల ముందుకు రానుంది.