చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై చర్యలు తీసుకున్నాం: మెటా

చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై చర్యలు తీసుకున్నాం: మెటా

న్యూఢిల్లీ: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్(సీఎస్ఏఎం– పిల్లలపై లైంగిక వేధింపుల కంటెంట్‌)పై చర్యలు తీసుకున్నట్లు మెటా వెల్లడించిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి, మెటా సంస్థకు మధ్య గత కొన్ని వారాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే భారతీయ చట్టాలకు లోబడి పనిచేయాల్సిన బాధ్యత గ్లోబల్ సోషల్ మీడియా వేదికలపై ఉంటుందని మెటాకు కేంద్ర అధికారులు తేల్చిచెప్పారు.

ఇకపై చట్టవిరుద్ధమైన కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌ల్లో ప్రత్యక్షమైతే.. ‘‘మాకేమీ తెలియదు, యూజర్లు పోస్ట్ చేశారు’’ అని చెప్పి కంపెనీలు తప్పించుకోలేవని, తగిన భద్రతా చర్యలు తీసుకోకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే తమ ఇన్‌స్టాగ్రామ్‌లో వెలుగుచూసిన చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ కంటెంట్‌పై ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నట్లు మెటా సంస్థ కేంద్ర ప్రభుత్వ వర్గాలకు స్పష్టం చేసింది.