సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్న పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ' మైఖేల్' . విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ మ్యూజికల్ బయోపిక్.. ఏప్రిల్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 8,300 కోట్లు మార్కుకు చేరువలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన బయోపిక్‌గా సరికొత్త రికార్డు సృష్టించేందుకు దూసుకుపోతోంది.
జాఫర్ జాక్సన్ అద్భుత నటన..
మైఖేల్ జాక్సన్ పాత్రలో ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ (Jaafar Jackson) నటించడం ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. మైఖేల్ స్టేజ్ ప్రెజెన్స్, ఐకానిక్ డ్యాన్స్ స్టైల్, హావభావాలను జాఫర్ వెండితెరపై అద్భుతంగా చేశాడని ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా తెరకెక్కించిన ఈ చిత్రం.. 'జాక్సన్ 5' గ్రూప్‌తో మొదలైన మైఖేల్ బాల్యం నుండి గ్లోబల్ సూపర్‌స్టార్‌గా ఎదిగిన ప్రయాణాన్ని కళ్లకు కట్టింది. మైఖేల్ జీవితంలోని భావోద్వేగాలు, కుటుంబ డ్రామాను ఇందులో అద్భుతంగా చూపించారు. నియా లాంగ్, జూలియానో వాల్డి, కోల్మన్ డొమింగో వంటి నటీనటులు కీలక పాత్రల్లో మెరిశారు.
ఓటీటీలోకి 'కింగ్ ఆఫ్ పాప్'..
థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీ వేదికలపైకి వచ్చేసింది. అయితే, ఇది ఉచితంగా కాకుండా ప్రీమియం రెంటల్ (Pay-per-view) మోడల్‌లో అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా కొన్ని ప్రత్యేకమైన బోనస్ కంటెంట్‌తో కలిపి రూ. 399 రెంటల్ ధరకు అందుబాటులో తెచ్చింది. ఇక బుక్‌మైషో స్ట్రీమ్ ప్లాట్‌ఫామ్‌లో సినిమాను వీక్షించడానికి రూ. 499 చెల్లించాల్సి ఉంటుంది. భారతీయ ప్రేక్షకుల కోసం ఇంగ్లీష్‌తో పాటు హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
థియేటరా? ఓటీటీనా?
ఓటీటీలోకి వచ్చినప్పటికీ.. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ సినిమా థియేట్రికల్ రన్ ఇంకా కొనసాగుతోంది. మైఖేల్ జాక్సన్ కన్సర్ట్ లెవెల్ సౌండ్ డిజైన్, భారీ కొరియోగ్రఫీలను పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే బిగ్ స్క్రీన్ అనుభవమే బెస్ట్ అని సినిమా ప్రియులు చెబుతున్నారు. థియేటర్లలో మిస్ అయిన వారికి మాత్రం ఈ ఓటీటీ రెంటల్ ఒక చక్కని అవకాశం. ఇక సాధారణ సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా ఈ సినిమా ఉచితంగా స్ట్రీమింగ్ అవ్వడానికి మరికొంత కాలం వేచి చూడాల్సిందే మరి.
