పాప్ సంగీత ప్రపంచాన్ని తన మూన్‌వాక్‌తో మంత్ర ముగ్ధులను చేసిన 'కింగ్ ఆఫ్ పాప్’ మైఖేల్ జాక్సన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన హాలీవుడ్ బయోపిక్ 'మైఖేల్' . ఏప్రిల్ 24, 2026న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ బయోపిక్ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
బాక్సాఫీస్ వద్ద రికార్డులు..
ఈ ఏడాది ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'మైఖేల్' మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 10 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన బయోపిక్‌గా నిలిచింది. అంతేకాదు, 'బోహీమియన్ రాప్సడీ' రికార్డును అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన మ్యూజిక్ బయోపిక్‌గా కొత్త చరిత్ర సృష్టించింది.
►ALSO READ | Rao Bahadur OTT Release: ఓటీటీలోకి 'రావు బహదూర్'.. సత్యదేవ్ సైకాలజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే?
ప్రఖ్యాత దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా తెరకెక్కించిన ఈ చిత్రానికి మూడు సార్లు ఆస్కార్ నామినేషన్ అందుకున్న జాన్ లోగన్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. మైఖేల్ జాక్సన్ పాత్రలో ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ నటించడం ఈ సినిమాకు అతిపెద్ద హైలైట్‌గా నిలిచింది. రూపంలోనే కాదు.. డాన్స్, హావభావాలు, స్టేజ్ ప్రెజెన్స్‌లోనూ అసలైన మైఖేల్‌ను గుర్తు చేస్తూ జాఫర్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడని విమర్శకులు ప్రశంసించారు.
జియో హాట్ స్టార్‌లో..
ఇప్పుడు ఈ చిత్రం ఆగస్టు 29 నుంచి జియోహాట్‌స్టార్‌లోని పీకాక్ హబ్ (Peacock Hub) ద్వారా స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ భాషలో కూడా సినిమా అందుబాటులోకి రానుందని అధికారంగా ప్రకటించింది. దీంతో భారతీయ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇండియాలో కూడా ఈ మూవీ రూ 54 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. గత నెల జూన్ 9నే అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ , బుక్ మై షో వంటి ఓటీటీల్లో అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఉచితంగానే స్ట్రీమింగ్ కానుంది.
He turned the moonwalk into a permanent flex.
— JioHotstar (@JioHotstar) July 28, 2026
Celebrate Michael Jackson's birthday with Michael, premiering 29th August on the Peacock Hub on JioHotstar.
Available in English & Hindi. pic.twitter.com/HXQxh8clWr
సినిమా కథ విషయానికొస్తే..
ఇండియానాలోని సాధారణ కుటుంబంలో జన్మించిన మైఖేల్, తన సోదరులతో కలిసి 'జాక్సన్ 5' బ్యాండ్ ద్వారా సంగీత ప్రపంచంలోకి అడుగుపెడతాడు. కఠిన స్వభావం కలిగిన తండ్రి జోసెఫ్ జాక్సన్ ఒత్తిళ్ల మధ్య ఎదుగుతూ, చిన్న వయసులోనే ప్రపంచ స్టార్‌గా ఎలా మారాడు? తన బాల్యాన్ని తిరిగి పొందాలనే కోరికతో నిర్మించిన 'నెవర్‌ల్యాండ్' వెనుక ఉన్న భావోద్వేగం ఏమిటి? ప్రపంచాన్ని ఊపేసిన 'థ్రిల్లర్', 'బీట్ ఇట్', 'బ్యాడ్' వంటి గీతాల వెనుక ఉన్న ప్రయాణం ఎలా సాగింది? అనే అంశాలను ఈ చిత్రం భావోద్వేగాలతో చూపిస్తుంది.
అయితే 1993లో మైఖేల్‌పై వచ్చిన బాలల లైంగిక వేధింపుల ఆరోపణలను సినిమాలో ప్రస్తావించకపోవడం, కథను 1980ల చివరి దశతో ముగించడం వంటి అంశాలపై కొంత విమర్శలు వచ్చినా.. సంగీతం, స్టేజ్ ప్రదర్శనలు, జాఫర్ నటన ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే ఈ విజువల్ మ్యూజికల్ జర్నీని ఆస్వాదించే అవకాశం పొందుతున్నారు.
