ఇండియాలో పాలు నిత్యవసర వస్తువు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ పోషకాహారంగా నిలిచే పాలు ప్రస్తుతం సామాన్యులకు భారంగా మారుతోంది. మహారాష్ట్రలోని భివాండి ప్రాంతంలో స్థానిక పాడి రైతుల అమ్మే తాజా పాలు లీటరుకు దాదాపు రూ.100కి చేరుకోవడం ప్రజల బడ్జెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుత పండుగ సీజన్లో డిమాండ్ పెరుగుతుండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.
వినియోగదారులు ధరల పెరుగుదల గురించి ఆందోళన చెందుతున్నప్పటికీ.. పాడి రైతుల వైపు నుంచి చూస్తే పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పశువుల మేత, దాణా, ఎండుగడ్డి, పశువుల కొనుగోలు ధరలు విపరీతంగా పెరగడమే ఈ సంక్షోధానికి ప్రధాన కారణమని భివాండి తాలూకా మిల్క్ ప్రొడ్యూసర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్ గాడ్గే తెలిపారు. గత 20-25 రోజుల్లోనే పశుదాణా ధరలు చుక్కలను తాకాయి. ఆయిల్ కేక్ ధర రూ. 38-40 నుంచి రూ. 50కి, చుని ధర రూ. 30-32 నుంచి రూ. 40కి పెరిగింది. అలాగే ఎండుగడ్డి, వరి గడ్డి, జొన్న-సజ్జ కాడల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇక ఆవుల రేటు రూ.లక్ష పైబడి, గేదె రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు చేరడంతో రైతులపై ఆర్థిక భారం విపరీతంగా పెరిగింది.
ఎల్ నినో ప్రభావం..
ఈ పరిస్థితుల వెనుక ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పులు గట్టిగానే ఉంది. ఎల్‌నినో పరిస్థితుల కారణంగా సకాలంలో వర్షాలు పడకపోవడం, తీవ్రమైన అనావృష్టి వల్ల దేశవ్యాప్తంగా పచ్చగడ్డి, పశుగ్రాసం, పంట దిగుబడులు భారీగా తగ్గిపోయాయి. దాణా తయారీకి ఉపయోగించే ముడిసరుకుల కొరత ఏర్పడటంతో ఫీడ్ ధరలు అసాధారణంగా ఎగబాకాయి. పశువులకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించలేక రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. వాతావరణ వైపరీత్యాల కారణంగా పాడి పరిశ్రమ నిర్వహణ కష్టంగా మారుతోంది.
షాపూర్ రైతుల సమ్మె..
ఈ దారుణ పరిస్థితులతో షాపూర్ ప్రాంతంలోని పిల్లి ప్రొడ్యూసర్స్ ఫార్మర్స్ సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రైతులు సమ్మెకు దిగారు. డైరీలకు పాలు సరఫరా నిలిపివేసి తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లేకపోవడం, పెరిగిన ఖర్చులకు తగినట్లుగా ప్రొక్యూర్మెంట్ ధరలు రాకపోవడంతో జీవనం సాగించడం కష్టమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు వినియోగదారులు అధిక ధరలతో ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు రైతులు ఉత్పాదక ఖర్చుల భారాన్ని మోయలేక సతమతమవుతున్నారు. ఎల్‌నినో పరిస్థితుల వల్ల ఏర్పడిన మేత కొరతను అధిగమించడానికి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, రైతులకు ఆర్థిక సహాయం అందించాలని.. సరైన పాల సేకరణ ధరలను నిర్ణయించాలని ప్రజలు కోరుతున్నారు.
