ఒత్తిడి తగ్గాలంటే యోగా చేయాలి.. ధ్యానం చేయాలి.. కౌన్సెలింగ్ తీసుకోవాలి.. ఇలాంటి సలహాలు మనం తరచూ వింటుంటాం. కానీ ఇప్పుడు యువత మాత్రం మరో మార్గాన్ని ఎంచుకుంటోంది. అదే యాంటీ- యాంగ్జైటీ జువెలరీ. చూడటానికి సాధారణ ఆభరణాల్లాగే కనిపించే ఈ రింగులు, బ్రేస్‌లెట్లు, పెండెంట్లు ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారుతున్నాయి. ఫ్యాషన్‌కు కొత్త అర్థం చెప్పడమే కాదు.. మానసిక ప్రశాంతత కోసం కూడా వీటిని ఉపయోగిస్తున్నారు.
ఇప్పటి యువతకు ఫ్యాషన్ అంటే కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదు. తమ వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను, జీవనశైలిని ప్రతిబింబించే అంశాలుగా చూస్తున్నారు. అందుకే దుస్తుల నుంచి ఆభరణాల వరకు ప్రతి వస్తువులోనూ ఉపయోగాన్ని వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే వెల్‌నెస్ జ్యువెలరీ అనే కొత్త విభాగం వేగంగా ప్రాచుర్యం పొందుతోంది.
యాంటీ- యాంగ్జైటీ జువెలరీ కూడా అందులో భాగమే. ఇవి కేవలం మెరిసే ఆభరణాలు కాదు. కానీ మనసు ఆందోళనగా ఉన్నప్పుడు చేతివేళ్లను బిజీగా ఉంచడం, దృష్టిని మరల్చడం, కాసేపు ప్రశాంతతను ఇవ్వడం వీటి ముఖ్య ఉద్దేశం.
ప్రత్యేకత ఏంటంటే..
ఈ ఆభరణాల్లో కొన్ని రింగులు తిప్పుకునే విధంగా ఉంటాయి. వాటిని నెమ్మదిగా తిప్పడం వల్ల చేతికి ఒక రిథమ్ ఏర్పడుతుంది. మరికొన్ని బ్రేస్‌లెట్లలో స్పర్శకు అనువైన ప్రత్యేక డిజైన్ ఉంటుంది. కొన్నింటిలో చిన్న ముత్యాలు, గుండ్రని బీడ్స్ ఉంటాయి. వాటిని వేళ్లతో కదిలించడం ద్వారా మనసు కొద్దిసేపు ఆందోళన నుంచి బయటపడుతుందని కస్టమర్స్ చెప్తున్నారు.
నిజం ఏంటంటే..మానసిక ఆరోగ్య నిపుణులు కూడా ఇలాంటి వస్తువులు కొంతమందికి గ్రౌండింగ్ టెక్నిక్‌లో భాగంగా ఉపయోగపడొచ్చని అంటున్నారు. అంటే మనసు ఆందోళనలో ఉన్నప్పుడు దృష్టిని ప్రస్తుతం జరుగుతున్న విషయాలపైకి తీసుకురావడంలో ఇవి సాయపడే అవకాశం ఉంది. అలాగని తీవ్రమైన ఆందోళన, పానిక్ అటాక్స్, డిప్రెషన్ వంటి సమస్యలకు ఇవి ప్రత్యామ్నాయం కావు అంటున్నారు.
జెన్ జీకి ఎందుకింత ఇష్టం?
సోషల్ మీడియా, చదువు, ఉద్యోగ పోటీ, సంబంధాల ఒత్తిడి.. ఇలా ఎన్నో కారణాలతో యువతలో ఆందోళన పెరుగుతోంది. కానీ ప్రతి ఒక్కరూ తమ సమస్యలను బహిరంగంగా చెప్పుకోవడానికి ఇష్టపడరు. అందుకే బయటకు ఎవరికీ తెలియకుండా, తాము మాత్రమే ఉపయోగించుకునే చిన్న చిన్న సాధనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒక రింగ్‌ను నెమ్మదిగా తిప్పడం, బ్రేస్‌లెట్‌ను చేతితో టచ్ చేస్తూ ఉండడం వంటి చిన్న చర్యలు కొంతమందికి ప్రశాంతతను కలిగిస్తాయని అనుభవాలు చెప్తున్నాయి. అందుకే ఇవి ఇప్పుడు డిస్క్రీట్ స్ట్రెస్ బస్టర్స్‌గా గుర్తింపు పొందుతున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్
టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, పింట్రెస్ట్ వంటి వేదికల్లో యాంగ్జైటీ రింగ్, కామ్ జువెలరీ, మైండ్‌ఫుల్ ఆక్సెసరీస్, ఫిడ్జెట్ రింగ్ వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో లక్షలాది పోస్టులు కనిపిస్తున్నాయి. చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్లు వీటిని తమ రోజువారీ జీవితంలో ఉపయోగిస్తున్నట్లు వీడియోలు పంచుకుంటున్నారు.
ఫ్యాషన్ మారుతోంది... ఆలోచన కూడా
యువత తమ భావోద్వేగాలను దాచిపెట్టకుండా, వాటిని అర్థం చేసుకుంటూ చిన్న చిన్న మార్గాల్లో ఉపశమనం వెతుకుతోంది. అందుకే యాంటీ యాంగ్జైటీ జువెలరీ కేవలం ఒక ఫ్యాషన్ ట్రెండ్ మాత్రమే కాదు. ‘‘మనసును కూడా జాగ్రత్తగా చూసుకోవాలి’’ అని గుర్తు చేసే కొత్త జీవనశైలికి ప్రతీకగా మారుతోంది. చేతికి కనిపించేది ఒక చిన్న రింగ్ కావచ్చు. కానీ దాని వెనుక దాగి ఉన్న సందేశం మాత్రం చాలా పెద్దది.
మీరూ లైఫ్‌కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు
featureseditor@v6velugu.com కి మెయిల్ చేయండి.
