ఖమ్మం రూరల్, వెలుగు : వానాకాలంలో సాగు చేసిన పంటలను కాపాడేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోదని, కానీ రానున్న కాలంలో నీటి కొరత ఏర్పడే అవకాశమున్నందున రెండో పంటగా వరి వేయొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రైతులకు సూచించారు. ఆదివారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో వివిధ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ..సూపర్ ఎల్‌నినో ప్రభావం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాలేదని, ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ పరిస్థితులున్నాయని తెలిపారు.
ఎల్‌నినో ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకుంటోందని, త్వరలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరమని, తెలంగాణకు అవసరమైన సహాయం అందేలా బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఏదులాపురాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మున్సిపాలిటీకి ప్రభుత్వం ఇప్పటికే రూ.75.50 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.
రోడ్లు, డ్రైనేజీలు, జంక్షన్ల అభివృద్ధి లాంటి మౌలిక సదుపాయాలు మెరుగుపర్చనున్నట్టు చెప్పారు. గత పాలకులు సృష్టించిన ఆర్థిక అవరోధాలను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత, ఖమ్మం ఆర్డీఓ ఎన్. శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస రెడ్డి, లీడర్లు, అధికారులు పాల్గొన్నారు.
