ఎల్ నినో తోనే కరువు పరిస్థితులు..పంట కాలం పూర్తయ్యేదాక రాత్రిళ్లూ కరెంట్సరఫరా : పొన్నం ప్రభాకర్

ఎల్ నినో తోనే కరువు పరిస్థితులు..పంట కాలం పూర్తయ్యేదాక రాత్రిళ్లూ కరెంట్సరఫరా : పొన్నం ప్రభాకర్
  •     గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టిస్తాం 
  •     మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్/ కోహెడ, వెలుగు: ఎల్​నినోతోనే కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, దీనికి ప్రభుత్వం కారణం కదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ స్పష్టం చేశారు. పంట కాలం ముగిసే వరకు రాత్రివేళల్లోనూ నాణ్యమైన కరెంట్​ సరఫరా చేస్తామని అన్నారు. శనివారం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్​లోని ఎల్లమ్మ చెరువు వద్ద బతుకమ్మ పండుగ ఏర్పాట్లు, చెరువు సుందరీకరణ, మైసమ్మ ఆలయ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రానికే ఆదర్శంగా నిలపడమే లక్ష్యమన్నారు. నీరు, విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పొదుపుగా వినియోగించుకోవాలని, శాస్త్రవేత్తల సూచనల మేరకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. 

ఎల్లమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, గ్లాస్ బ్రిడ్జి, అర్బన్ ఫారెస్ట్ పార్క్ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. కప్పగుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంతో పాటు యువత కోసం కబడ్డీ అకాడమీని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. చెరువు ఘాట్ వద్ద పటిష్టమైన బారికేడ్లు, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎల్లమ్మ, ఆరేపల్లి చెరువుల వద్ద ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రజలు కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ప్రారంభమైన గౌరవెల్లి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భూసేకరణను వేగవంతం చేసి, త్వరలో కాలువలు, ఎంఎంఆర్ ప్యాకేజీ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ‘పల్లె పల్లెకు పొన్నం అన్న’ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు, సోలార్ విద్యుత్ ఏర్పాటుపై ప్రజలు దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్, మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, ఆర్డీవో రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. కోహెడ మండలం బస్వాపూర్​కు చెందిన కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నాయకుడు తడిసిన అమరేందర్​రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.