హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. సొంత ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నాయకులు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం సరికాదని విమర్శించారు. ఆదివారం (అక్టోబర్ 25) మంత్రి పొన్నం ప్రభాకర్ జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ధర్మపురి బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు.
రూ.2.57 కోట్లతో రెండు ప్లాట్‌ఫారాల విస్తరణ, గ్రానైట్ ఫ్లోరింగ్, కొత్త టాయిలెట్ బ్లాక్, సీసీ పేవ్మెంట్, వర్షపు నీటి పారుదల, విద్యుదీకరణ తదితర పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉందని ఇది బీఆర్ఎస్ నాయకులకు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అబద్ధాలంటూ విమర్శించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు వర్షాలు కురిపిస్తే వారి కాళ్లు మొక్కుతానని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని.. అంతేకానీ ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం సరికాదని ప్రతిపక్షాలకు చురకలంటించారు.
