సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పై నిరసనలు కవర్ చేసిన... మహిళా జర్నలిస్టులపై దాడులు ఆందోళనకరం: మంత్రి సీతక్క

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పై నిరసనలు కవర్ చేసిన... మహిళా జర్నలిస్టులపై దాడులు ఆందోళనకరం: మంత్రి సీతక్క

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు కవర్ చేసిన మహిళా జర్నలిస్టులపై దాడులు, లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర ఆందోళనకరమని అన్నారు మంత్రి సీతక్క. శనివారం ( అక్టోబర్ 24 ) జరిగిన మహిళా జర్నలిస్టుల జాతీయ సదస్సులో పాల్గొన్న సీతక్క అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించే మహిళా జర్నలిస్టులను శత్రువులుగా చూడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు సీతక్క.

అధికారాన్ని ప్రశ్నించే మహిళా జర్నలిస్టులు ప్రతీకార చర్యలకు భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అన్నారు. ప్రశ్నలను అణచివేయడంలో కాదు.. వాటికి సమాధానం చెప్పే ధైర్యంలోనే ప్రజాస్వామ్య బలం ఉందని అన్నారు సీతక్క. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మహిళల స్వేచ్ఛపై తలెత్తుతున్న ప్రశ్నలను విస్మరించలేమని.. మహిళలను పురుషుల ఆధీనంలో ఉంచే మనుస్మృతి భావజాలం కాదు.. అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే మాకు సర్వోన్నతమని అన్నారు సీతక్క.

మహిళలు ఎవరి దయాదాక్షిణ్యాలూ కోరడం లేదని.. రాజ్యాంగం కల్పించిన హక్కులను డిమాండ్ చేస్తున్నారని స్పష్టం చేశారు. పత్రికా స్వేచ్ఛ, అధికారాన్ని ప్రశ్నించే హక్కు లేకుండా ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని.. ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలను కేవలం ఆదాయార్జనకే పరిమితం చేయకుండా ఆస్తులు, వ్యాపారాలకు యజమానులుగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు సీతక్క. మహిళా జర్నలిస్టుల భద్రత, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణకు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.