ములుగు/ వెంకటాపూర్/ తాడ్వాయి, వెలుగు: సొంతిల్లు లేని పేదలు ఉండకూడదన్న సదుద్దేశంతో సీఎం రేవంత్రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారని పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ విడతల వారీగా ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. శుక్రవారం ములుగు జిల్లాలో విస్తృతంగా పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలుచోట్ల మహిళలతో కలిసి బతుకమ్మ సంబురాల్లో సందడి చేశారు. గోవిందరావుపేట రైతు వేదికలో మండలంలోని 13 గ్రామాలకు చెందిన 109 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.5.45 కోట్లతో నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు.
ములుగు కలెక్టరేట్లో కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో మహిళా ఆఫీసర్లు, ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. ములుగు, మల్లంపల్లి మండలాలకు చెందిన 32 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. తాడ్వాయి పీఏసీఎస్నూతన చైర్మన్ బొల్లు దేవేందర్, వైస్ చైర్మన్ జాలపు అనంతరెడ్డి డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పాలకవర్గం రైతులకు అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందించాలన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆర్చి వద్ద మహిళలతో కలిసి మంత్రి బతుకమ్మ ఆడారు. పార్టీ మండలాధ్యక్షుడు మంకిడి నరసింహస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
