- కొండపోచమ్మ నుంచి రూ.50 కోట్ల ప్రజాధనంతో కాల్వలు: మంత్రి వివేక్
- 2016 కు ముందు ఫామ్ హౌస్ దగ్గర చెరువే లేదు
- 58 ఎకరాల్లో పాండురంగ చెరువు నిర్మించి నీటి మళ్లింపు
- మంచిర్యాలలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి వివేక్-సరోజ దంపతులు
కోల్‌బెల్ట్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని, పదేండ్లలో రాష్ట్రంలో కొత్తగా ఒక్క ఎకరానికి నీళ్లివ్వకున్నా తన ఫాంహౌస్‌లోని పంటపొలాలకు మాత్రం కొండపోచమ్మ సాగర్ నుంచి అక్రమంగా నీళ్లు మళ్లించుకున్నాడని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. ఇందుకు రూ.50 కోట్ల ప్రజాధనం వాడుకున్నాడని, ఫాంహౌస్‌లో పెద్ద ఎత్తున ప్రభుత్వ, అసైన్డ్ భూములు కలిపేసుకున్నాడని ఆరోపించారు. ఆదివారం మంచిర్యాలలోని మంత్రి నివాసంలో మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీలు, మందమర్రి రూరల్‌కు చెందిన బీఎల్ఏలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం క్యాతనపల్లి మున్సిపాలిటీలో రూ.1.80 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టంను కలెక్టర్ కుమార్ దీపక్, మంత్రి వివేక్ సరోజ దంపతులు ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, డీసీసీ రఘునాథ్‌రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ వొడ్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. క్యాతనపల్లిలోని అమరవాది, రామకృష్ణాపూర్‌లోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో, మందమర్రిలోని హన్మాన్ మందిర్, ఊరుమందమర్రి మినీ ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలకు మంత్రి వివేక్‌వెంకటస్వామి, -సరోజ దంపతులు, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ, -శ్రీవాణి దంపతులు హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ కొండపోచమ్మ సాగర్‌నుంచి ప్రత్యేకంగా కాల్వలు తవ్వించి కేసీఆర్ తన ఫామ్హౌస్‌కు నీళ్లు మళ్లించుకున్నట్టు చెప్పారు. 2016కు ముందు కేసీఆర్ ఫామ్‌హౌస్ ఎదురుగా చెరువే లేదని, కానీ 58 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ ల్యాండ్‌లో పాండురంగ చెరువును తవ్వించి మోటార్లు పెట్టుకున్నారని, ఏకంగా మూడు ఎకరాల విస్తీర్ణంలో బావిని తవ్వి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టాడని మంత్రి ఫైర్ అయ్యారు.
వేల కోట్ల ఆస్తులు ఎక్కడివి?
మేడిగడ్డ పంపులు ఆన్ చేయాలంటున్న కేటీఆర్.. బ్యారేజ్ ఎందుకు నిర్మించారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.22వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రాణిహిత-, చేవేళ్ల ప్రాజెక్టు పూర్తయ్యేదని అన్నారు. కేటీఆర్‌కు సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన లేదన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలో 51 టీఎంసీల బ్యారేజీ కట్టి రూ.10వేల కోట్ల ప్రజల సొమ్మును దండుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడక ముందు కేసీఆర్ కుటుంబానికి 22 ఎకరాల భూమి ఉంటే పదేళ్లలో 300 ఎకరాలు ఎలా సంపాదించుకున్నారని ప్రశ్నించారు. పదేండ్లలో కేసీఆర్, తన కుటుంబసభ్యుల పేర్ల మీద భూములు, వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని అన్నారు. వంద కేసులు అంటూ ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు వంద కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని, దందాలతో ఆస్తులు కూడబెట్టుకున్నాడని, గత ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చు చేశాడని, ఆయన ఎన్నికల అఫిడవిట్‌ను ప్రజలు పరిశీలిస్తే నిజాలు బయటపడుతాయని మంత్రి అన్నారు.
ప్రతిఒక్కరూ పొదుపు పాటించండి
ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రజలు, రైతులు సహకరించాలని, వచ్చే జూన్ వరకు ఈ ప్రభావం ఉంటుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. నీరు, కరెంటు వినియోగంలో ప్రతి ఒక్కరూ పొదుపును పాటించాలని సూచించారు. ప్రకృతి విధ్వంసాలకు కూడా ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తాను కూడా నీటిని పొదుపుగా వాడుకోవడం, విద్యుత్‌ను కూడా ఆదా చేస్తున్నానని మంత్రి తెలిపారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత క్యాతనపల్లిలో అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు నడుస్తున్నాయన్నారు. రూ.40కోట్లతో అమృత్స్కీం ద్వారా ఇంటింటికి నల్ల నీళ్లును సప్లై చేస్తామని, మరో ఆరు నెలల్లో పనులు పూర్తి అవుతాయన్నారు. రూ.100 కోట్ల టీయూఐడీఎఫ్సీ, నగర అభివృద్ది, డీఎంఎఫ్టీ నిధుల ద్వారా అభివృద్ది పనులు నడుస్తున్నాయన్నారు. సర్ ప్రక్రియలో అర్హులైన కొత్త ఓటర్ల పేర్లను నమోదు చేసే బాధ్యత బీఎల్ఏలే తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు కూడా వారికి సహకరించాలని సూచించారు. మరో వారం రోజులు కొత్త ఓటర్ల నమోదుకు గడువు ఉందని, దసరా పండుగ తర్వాత నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.
మంత్రిని కలిసిన అగ్రి గోల్డ్ బాధితులు
అగ్రిగోల్డ్ బాధితులు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి తమకు న్యాయం జరిపించాలని కోరారు. అగ్రి గోల్డ్ సంస్థకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని సెంటర్లలో, తెలంగాణలో మూడు చోట్ల సీఐడీ బాండ్ల వెరిఫికేషన్ సెంటర్లను ఏర్పాటు చేసిందని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 80 వేల మంది మంది బాధితులు ఉన్నందున మంచిర్యాలలో వెరిఫికేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. సానుకూలంగా స్పందించిన వివేక్.. సీఐడీ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
