మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో కోటి నలబై లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన బైపాస్ రోడ్డును రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఘనంగా ప్రారంభించారు.రోడ్డు ప్రారంభోత్సవం అనంతరం మంత్రి వివేక్ మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం మున్సిపల్ ఎన్నికల కోసమే ఈ పనులు ప్రారంభించామని ప్రతిపక్షాలు ఆరోపించాయని, కానీ తాము మాటల్లో కాకుండా అతి త్వరలోనే రోడ్డు నిర్మాణం పూర్తి చేసి చేతల్లో చూపించామని అన్నారు. తాము ఓట్ల కోసం హంగామా చేయమని, అభివృద్ధి చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నిధులు లేకపోయినా కేవలం శంకుస్థాపనలు మాత్రమే చేసి వదిలేశారని విమర్శించారు.
చెన్నూరు పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ పనుల కోసం స్థానిక యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కట్టడాలను తొలగించుకోవడం అభినందనీయమన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా షాపులు కోల్పోయిన 70 మంది బాధితులకు.. కొత్తగా నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్‌లలో షాపులు కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఇళ్లు, షాపులు కోల్పోయిన వారికి కూడా న్యాయం చేస్తామన్నారు. అంతేకాకుండా, చెన్నూరు చెరువులోని శివాలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి, ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
ఈరోజు ఉదయం మార్నింగ్ వాక్ సమయంలో హాస్టల్ విద్యార్థులు కొన్ని సమస్యలను తన దృష్టికి తెచ్చారని మంత్రి తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన, సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్‌ను ఆదేశించినట్లు చెప్పారు. అయితే, విద్యార్థుల సమస్యలపై ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. లక్షెట్టిపేట నుండి ఇక్కడికి వచ్చిన కొందరు విద్యార్థులను కావాలనే రాజకీయాల కోసం వాడుకుని వెళ్లగొట్టారని ఆరోపించారు. మైనారిటీ హాస్టళ్లలో కూడా ప్రతిపక్ష నేతలు ఆహారంలో కారం వేసి, ఫొటోలు తీసి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా హాస్టళ్లలోకి చొరబడి తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే స్థానికంగా ఉండేవారు కాదని, కానీ తాను వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి ప్రజల అందుబాటులో ఉంటున్నానని మంత్రి గుర్తుచేశారు. చెన్నూరు ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు రూ.40 కోట్ల వ్యయంతో గోదావరి నది నుండి తాగునీరు అందిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ సందర్భంగా వెల్లడించారు.
