రంగారెడ్డి జిల్లా ఇబ్రంహీంపట్నం మండలంలోఅంబేద్కర్ సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 2026 సెప్టెంబర్ 06న అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రం నిర్మాణం చేయాలనుకోవడంపై నిర్వాహకులను అభినందించారు.
ఎక్కడ అణిచివేత జరిగితే అక్కడ అంబేద్కర్ ఉండేవారని.. ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ అంబేద్కర్ కళా భవనం ఏర్పాటు చేయడం చాలా ఉపయోగకరమని అన్నారు. ఏం ఫండ్స్ కావాలన్నా సహాయ సహకారం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీకి అభినందనలు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేట్‌లోని సైబర్ మెడోస్ వెంచర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి వివేక్ తో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు, సామాజిక సమానత్వం, విద్య, కళలు, సాంస్కృతిక విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమానికి కళాకారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
