- రైతులు ఆలోచించి ఆరుతడి పంటలు వేసుకోవాలి: మంత్రి వివేక్
- దుబ్బాక సెగ్మెంట్లో ఇళ్ల పట్టాలు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
తొగుట/తూప్రాన్/నర్సాపూర్, వెలుగు: గతంలో అందరం ఒక్కటై కరోనాను ఎదుర్కొన్నట్లే.. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో ఎల్ నినోను ఎదుర్కొందామని రాష్ట్ర శక్తి, గనుల శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా అక్బర్ పేట–భూంపల్లిలో దుబ్బాక, భూంపల్లి–-అక్బర్పేట, మిరుదొడ్డి, రాయపోల్, దౌల్తాబాద్, తొగుట మండలాలకు చెందిన 2,111 మంది డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. 179 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.1.79 కోట్ల విలువైన చెక్కులను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి అందజేశారు.
ఎల్‌నినో నేపథ్యంలో వచ్చే జూన్ వరకు వర్షం పడే అవకాశం లేనందున రైతులు వరి వేయొద్దని, ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేసుకోవాలని చెప్పారు. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే 12 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, మరో 3 వేల ఇళ్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు. గృహజ్యోతి, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో పేదలకు ప్రయోజనం కలుగుతోందన్నారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామని, త్వరలో కొత్త పింఛన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సిద్దిపేట కలెక్టర్ హైమావతి, రాష్ట్ర పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ పాల్గొన్నారు.
సింగరేణిలో స్థానికుల నియామకానికి జీవో ఇచ్చాం
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్ల మాచునూర్‌లో బతుకమ్మ ఘాట్‌ను మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. సీఎస్సార్ నిధులతో అంగన్వాడీ సెంటర్‌తోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోయిందని, కాంగ్రెస్ వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత సింగరేణిలో స్థానికులనే రిక్రూట్ చేయాలని చెప్పి, జీవో జారీ చేశామన్నారు. ప్లే గ్రౌండ్ ఏర్పాటుకు, రైతులు పొలాలకు వెళ్లడానికి రోడ్లు వేసేందుకు కృషి చేస్తానన్నారు. అడిషనల్ కలెక్టర్ పాండు, ఏఎస్పీ చైతన్య, కాంగ్రెస్నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు
బీఆర్ఎస్ లో కేటీఆర్, హరీశ్‌రావు మధ్య పోరు ఆధిపత్య పోరు నడుస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం తూప్రాన్ లో పీఏసీఎస్‌చైర్మన్ ఉమ్మన్నగారి భాస్కర్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ కమీషన్ల కోసమే పని చేసిందని ఆరోపించారు. ఉద్యమ సమయంలో 22 ఎకరాల భూమి ఉన్న కేసీఆర్ కుటుంబసభ్యులకు ప్రస్తుతం వందల ఎకరాలు, ఫైవ్స్టార్హోటళ్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర నాయకుడు చిక్కుల మహిపాల్ రెడ్డి తదితరులున్నారు.
నీరు, కరెంట్పొదుపుగా వాడుకోవాలి
పద్మారావునగర్, వెలుగు: ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా ప్రజలు, రైతులు నీరు, కరెంట్పొదుపుగా వాడుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. దేవీ నవరాత్రోత్సవాల సందర్భంగా శుక్రవారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని ఏఐసీసీ సభ్యుడు సచిన్ సావంత్, మంత్రులు పొన్నం ప్రభాకర్ తో కలిసి దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రంలో సుమారు 35 లక్షల బోరుబావులు ఉండటంతో భూగర్భ జలాల వినియోగం పెరిగిందని, గతేడాదితో పోలిస్తే విద్యుత్ వాడకం దాదాపు 20 శాతం పెరిగిందని చెప్పారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువని కొందరు ప్రచారం చేయడం అవివేకమన్నారు. రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరుతూ త్వరలోనే ప్రధాని మోదీని కలుస్తామని వెల్లడించారు. మోదీ ప్రభుత్వం ముడిచమురు ధర 100 డాలర్లు ఉన్నప్పుడే లీటర్పెట్రోల్, డీజిల్‌ధరలను రూ.110 వరకు పెంచిందని, అంతర్జాతీయంగా ధరలు తగ్గినా ఆ ప్రయోజనాన్ని ప్రజలకు అందించకుండా అదనపు పన్నుల భారం మోపుతోందని మండిపడ్డారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్, పీసీసీ వైస్ ప్రెసిడెంట్డాక్టర్కోట నీలిమ, కాంగ్రెస్సికింద్రాబాద్ఇన్చార్జి ఆదం సంతోష్పాల్గొన్నారు.
