క్యాతనపల్లి: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమరావతి గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి దంపతులు వివేక్ వెంకటస్వామి, విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సరోజ పాల్గొన్నారు.
గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ముందుగా.. గ్రామ శివారులోని చెరువు మత్తటి వద్ద నూతనంగా నిర్మించిన బతుకమ్మ ఘాట్ను మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం ఊరు మందమర్రి మినీ ట్యాంక్ బండ్, రామక్రిష్ణపూర్ సూపర్ బజార్, ఆర్కే సీఎస్పీ, ఠాగూర్ స్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఈ బతుకమ్మ సంబరాల్లో కార్మిక, గనుల, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఆయన సతీమణి సరోజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. మంత్రి వివేక్ వెంకటస్వామి రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మహిళలు ఆత్మ గౌరవంతో జరుపుకునే పండుగ సద్దుల బతుకమ్మ అని చెప్పారు.
ఎలినినో ప్రభావంతో జూన్ వరకు తాగు నీరు, సాగు నీరు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, ప్రజలందరూ నీళ్లను పొదుపుగా వాడుకోవాలని మంత్రి సూచించారు. 10 ఏండ్ల కాలంలో సింగరేణిలో ఒక్క కొత్త గని రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మందమర్రి ఏరియాకు కొత్త గని తీసుకోవచ్చానని ఆయన గుర్తుచేశారు.
ఎల్ నినో ప్రభావం తెలంగాణపై ఉండవద్దని దుర్గా దేవి అమ్మవారిని కోరుకున్నానని, గత మూడేండ్లుగా సద్దుల బతుకమ్మ, దసరా పండుగ వేడుకలను కుటుంబ సమేతంగా జరుపుకోవడం తనకు సంతోషంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రజా పాలన ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని చెప్పారు.
