బీజేపీ కార్యకర్తలా సీఈసీ .. రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను కేంద్రం కాలరాస్తున్నది

బీజేపీ కార్యకర్తలా సీఈసీ .. రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను కేంద్రం కాలరాస్తున్నది
  •     ఓట్‌‌చోరీపై రాహుల్‌‌ ముందే చెప్పారని వెల్లడి
  •     ‘సుప్రీం మార్చ్’​ ర్యాలీలో జాతీయ జెండాతో పాల్గొన్న వివేక్‌‌

 

న్యూఢిల్లీ, వెలుగు: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ స్వతంత్రంగా వ్యవహరించకుండా బీజేపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని మంత్రి వివేక్‌ వెంకటస్వామి మండిపడ్డారు. రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తున్నదని విమర్శించారు. దేశంలో ఓట్‌ చోరీ జరుగుతున్నదని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ముందే హెచ్చరించారని గుర్తు చేశారు. ‘సర్‌‌లో అవకతవకలు, ప్రజాస్వామ్య వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నిర్వహించిన ‘సుప్రీంకోర్టు మార్చ్’లో మంత్రి వివేక్‌ వెంకటస్వామి పాల్గొన్నారు.

బస్సులో నేతలందరితో కలిసి బారాఖంబా వరకు చేరుకున్నారు. అక్కడి నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి జాతీయ పతాకాన్ని చేతబూని ర్యాలీగా బయలుదేరారు.  సీడబ్ల్యూసీ ముఖ్య నేతలు, ఎంపీలు, కార్యకర్తలతో కలిసి మండిహౌస్ వరకు నిరసన ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 13 కోట్ల ఓట్లను తొలగించారు..

గతంలో బెంగళూరులోని ఒకే అపార్ట్‌మెంట్‌ పరిధిలో 80 అడ్రస్‌లతో బోగస్ ఓట్లను సృష్టించారని, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏకంగా 13 కోట్ల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారని మంత్రి వివేక్‌ పేర్కొన్నారు. దీంతో దేశ ప్రజలంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. డాక్టర్‌‌ బీఆర్‌‌ అంబేద్కర్‌‌ రాజ్యాంగం ద్వారా ప్రజలకు అందించిన ఓటు హక్కు కోసం ప్రజలు ఎదురుచూస్తుంటారని చెప్పారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ ఎజెండాతో పోరాటం చేయడం వల్లే యూపీలో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలిందన్నారు.

ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ, అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ కుమ్మక్కై ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నిష్పక్షపాతంగా ఉండాల్సిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, ఈడీ లాంటి రాజ్యాంగబద్ధ, స్వతంత్ర సంస్థలను తమ గుప్పిట్లోకి తీసుకొని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టికల్ 19 ప్రకారం శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కును రాజ్యాంగం ప్రసాదించిందని, అయితే తమ అక్రమాలు, తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో ఆ నిరసన హక్కును కూడా కేంద్ర ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపించారు.