మోహన్ బాబు వరుస ట్వీట్లు : స్నేహానికి అర్థం తెలియని వ్యక్తి చంద్రబాబు

మోహన్ బాబు వరుస ట్వీట్లు : స్నేహానికి అర్థం తెలియని వ్యక్తి చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా సీరియస్ అయ్యారు సినీ నటుడు మోహన్ బాబు. రెండు రోజుల క్రితం మోహన్ బాబు క్రమశిక్షణలేని మనిషి అని చంద్రబాబు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం ట్విట్టర్ లో స్పందించిన మోహన్ బాబు..చంద్రబాబుపై వరుస ట్వీట్లు చేశారు.

‘క్రమశిక్షణ అనే పదానికి, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడివే. దయ చేసి ఏ సందర్భంలోనూ నా పేరుకు భంగం కలిగించేటట్టు ప్రస్తావించకు. అది నీకు నాకు మంచిది. ఎక్కడైనా, ఎప్పుడైనా ఎదురు పడితే సరదాగా మాట్లాడుకుందాం, అదీ నీకు ఇష్టమైతే. ఉంటా!

నా మనసును గాయపరిచావు. అన్న యన్. టి. ఆర్, అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు నా సినిమా పరిశ్రమ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మోహన్ బాబు అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు, చెప్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే.

చంద్రబాబు ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరు దారిన వాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంతా ప్రశాంత వాతావరణం. ఈ సమయంలో మళ్ళీ ఇలా నా మనసును ఇబ్బంది పెడతావు అనుకోలేదు. రెండు రోజుల క్రితం క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్ బాబు అని నీ నోటి నుండి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది’ అని ట్వీట్లు చేశారు మోహన్ బాబు.