
ఒక సాధారణ వ్యక్తికి సూపర్ పవర్స్ వస్తే.. అతను ప్రజలకు ఎలా సహాయ పడతాడు అనేది ప్రతీ సూపర్ హీరో సినిమాల్లో కనిపించే కాన్సెప్ట్. ఇటీవల టాలీవుడ్ లో వచ్చిన హనుమాన్ సినిమాలో కూడా ఇదే చూపించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాదాపు అలాంటి కథతోనే వస్తున్న హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్(Monkey Man). ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ దేవ్ పటేల్(Dev Patel) నటిస్తూ, నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్.
హిందూ పురాణాల్లోని హనుమంతుడి పాత్ర నుండి స్ఫూర్తి పొందిన హీరో.. దుర్మార్గుల నుండి ప్రజలను ఎలా కాపాడాడు అనేది ఈ సినిమా కథ. ట్రైలర్ నెక్స్ట్ లెవల్లో డిజైన్ చేశారు. ఒక్కో షాట్, ఒక్కో విజువల్ గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ ట్రైలర్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.. నా చిన్నతనంలో మా అమ్మ నాకు ఒక కథ చెప్పేది.. అనే డైలాగ్తో మొదలైన మంకీ మ్యాన్ ట్రైలర్.. రాక్షస రాజు, తన సైన్యం కలిసి ప్రజలను భయపెట్టేవారు. అప్పుడే వారికి ప్రజల రక్షకుడు ఎదురయ్యాడు. ది వైట్ మంకీ.. వంటి డైలాగ్స్ తో మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక ట్రైలర్ మధ్యలో వచ్చిన హనుమంతుడి రిఫరెన్స్ షాట్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు మేకర్స్.
ఇక మంకీ మ్యాన్ సినిమా విషయానికి వస్తే.. పేరుకి హాలీవుడ్ సినిమానే అయినా అందరు ఇండియన్ యాక్టర్సే ఉన్నారు. ఈ సినిమాలో దేవ్ పటేల్ కు జోడీగా శోభితా దూళిపాళ నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్స్ మకరంద్ దేశ్పాండే, సిఖందర్ ఖేర్ విలన్స్ గా కనిపించనున్నారు. మరి ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేస్తున్న మంకీ మ్యాన్ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.