మెడికల్ షాపుపై కోతుల మూక దాడి

మెడికల్ షాపుపై కోతుల మూక దాడి

లక్సెట్టిపేట, వెలుగు: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలోని ఓ మెడికల్ షాపులో ఆదివారం ఒక కోతి ప్రమాదవశాత్తు చనిపోవడంతో ఆగ్రహించిన మిగతా కోతులు ఆ దుకాణంపై దాడి చేశాయి. తోటి కోతి మృతి చెందిందన్న ఆగ్రహంతో వస్తువులను చిందరవందర చేస్తూ కాసేపు బీభత్సం సృష్టించాయి. స్థానిక బీట్ బజార్ లోని అపోలో ఫార్మసీలోకి అనుకోకుండా రెండు కోతులు దూరాయి. భయపడ్డ కస్టమర్లు వాటిని తరిమే ప్రయత్నం చేశారు.

ఆకస్మాత్తుగా షాపు డోర్ మూయడంతో అందులో ఇరుక్కొని ఒక కోతి చనిపోయింది. దీంతో ఆగ్రహించిన మిగతా కోతులు ఒక్కసారిగా ఆ దుకాణం గ్లాస్ డోర్ పై దూకుతూ కొద్దిసేపు గందరగోళం సృష్టించాయి. చివరకు మృతిచెందిన కోతిని తీసుకొని వెళ్లి పక్కనే ఉన్న సందులో పెట్టుకొని చుట్టూ చేరి ఎవరినీ దగ్గరకు రానివ్వకుండా చేశాయి. కొద్దిసేపటి తర్వాత కోతులు పక్కకు వెళ్లడంతో మృతి చెందిన కోతిని ఆ దుకాణం సిబ్బంది తీసుకువెళ్లి గోదావరి దగ్గర పూడ్చిపెట్టారు.