స్వయంగా నిర్ణయం తీసుకోవాలి.. ఈ నీతి కథలు చదివితే ఎందుకో తెలుస్తుంది..!

స్వయంగా నిర్ణయం తీసుకోవాలి.. ఈ నీతి కథలు చదివితే ఎందుకో తెలుస్తుంది..!

ప్రజాక్షేమం కోసం కొన్ని నిర్ణయాలను అమలుపరచడానికి అప్పటికప్పుడు స్వయంగా నిర్ణయం తీసుకుని స్పందించవలసి వస్తుంది. అది ఒకరు చెప్పేది కాదు. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక ధౌమ్యుడు అనే ముని నివసించేవాడు. ఎంతో పాండిత్యం ఉన్న ఆ గురువు ఆశ్రమంలో గురుకులం కూడా ఉంది. ఆ ఆశ్రమంలో అరుణి అనే ఒక విద్యార్థి ఉండేవాడు. అతడికి చదువులో ఎక్కువ తెలివితేటలు లేకపోయినా, వినయవిధేయతలు మాత్రం అధికంగా ఉన్నాయి.

ఒకనాడు ఆ అడవిలో పెద్ద వాన కురిసింది. ఆ కారణంగా లోతట్టు ప్రాంతంలో ఉన్న పొలాలు, కూరగాయల తోటలు పూర్తిగా నీటితో నిండిపోసాగాయి. ఒక చోట గట్టుకు గండి పడి, పొలాలలోకి నీరు రావడం మొదలైంది. ఆ ప్రాంతాన్ని రాళ్లతోను, ఇసుకతోను మూసివేయడానికి ప్రయత్నించాడు.

అయినా నీరు వస్తూనే ఉండటంతో అరుణి ఆ గండికి అడ్డంగా పడుకుని, అక్కడే నిద్రపోయాడు. నీరు రావడం తగ్గింది. ఇంతలో వర్షం ఆగింది. వాన తగ్గినా అరుణి ఇంకా ఇంటికి రాకపోవడంతో గురువుగారు కొద్దిగా కంగారుపడ్డారు. అరుణి కోసం వెతకడం ప్రారంభించాడు. గట్టిగా పిలిచాడు. ఆ పిలుపుకి మేల్కొని, ‘అయ్యా గురువుగారూ! ఇక్కడే ఉన్నాను’ అని సమాధానమిచ్చాడు. ఆ శబ్దం వచ్చిన వైపుగా శిష్యులతో కలిసి గురువుగారు వెళ్లారు. అక్కడ పడుకున్న అరుణిని చూసి గురువు గారు ఆశ్చర్య పోయారు.

విషయం తెలుసుకుని ఎంతో సంతోషపడ్డారు. శిష్యుడిని దగ్గరకు తీసుకుని, ‘విధేయత అంటే ఏమిటో చూపావు. నీ కథ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. నీకు సర్వశాస్త్ర జ్ఞానం కలగాలని ఆశీర్వదిస్తున్నాను. నీకు ‘ఉద్దాలకుడు’ అని బిరుదు ఇస్తున్నాను. ఈ పదానికి నీటిలో నుంచి పుట్టినవాడు అని అర్థం’ అని ఆశీర్వదించాడు. ఆ తరువాతి కాలంలో ఉద్దాలకుడు పెద్ద పండితుడిగా రాణించాడు.

సాధారణంగా ఎవరికైనా ఒక పని చెప్పినప్పుడు, ఆ పని మాత్రమే చేసుకుని వస్తారు. ఇందుకు ఒక చిన్న కథ ఉదాహరణ. ఒక ఊరిలో వెంకట్రామయ్య అనే రైతు ఉన్నాడు. అతడికి ఒక కొడుకు ఉన్నాడు. వెంకట్రామయ్యకు ప్రతిరోజూ పొలానికి వెళ్లి, అంతా చూసుకుని రావటం అలవాటు. ఒకనాడు అనారోగ్యంగా ఉండటంతో, కొడుకుని పిలిచి, ‘నాయనా! పొలానికి వెళ్లి, అక్కడ ఎలుకలు ఏమైనా పాడు చేస్తున్నాయేమో చూసిరా’ అన్నాడు. అలాగేనని చెప్పి పొలానికి వెళ్లాడు. అక్కడ ఎలుకలు వందల సంఖ్యలో పొలమంతా తవ్వేస్తూ పాడు చేస్తున్నాయి.

తండ్రి చూసి రమ్మన్నాడు కనుక, చూసి వచ్చేశాడు. ఇంటికి వచ్చిన కొడుకుని వివరం అడిగాడు. ‘పొలం నిండా వందల కొద్దీ ఎలుకలు తిరుగుతున్నాయి’ అని సమాధానమిచ్చాడు. అప్పుడు వెంకట్రామయ్య పరుగుపరుగున పొలానికి వెళ్లి, తగు జాగ్రత్తలు తీసుకుని ఇంటికి వచ్చి, కొడుకుని మందలించాడు. తండ్రి చూసి రమ్మన్నాడు కనుక చూసి వచ్చేశాడు. అంతే.

రామాయణంలో హనుమంతుడి గురించి పరిశీలిస్తే – ‘చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు’ అనే నానుడి తెలిసిందే. రాముని కోరిక మేరకు సీతమ్మను చూసి రమ్మని హనుమంతుని ఆజ్ఞాపించాడు సుగ్రీవుడు. సరేనని హనుమంతుడు బయలుదేరి లంక చేరాడు. లంక అంతా వెతికాడు. ఆ తల్లి సీత ఎక్కడా కనిపించలేదు. అంతలోనే అశోకవనంలో శింశుపా వృక్షం నీడలో, మాసిపోయిన వస్త్రాలతో కనిపించింది. తనను గుర్తించడానికి రాముడు ఇచ్చిన అంగుళీయకాన్ని ఆమెకు అందించాడు. అక్కడితో హనుమంతుడి పని అయిపోయినట్లే. చూసి రమ్మన్నారు. చూశాడు. అంతే. కాని అక్కడితో ఆగలేదు.

లంకా నగరంలో కొంత భాగాన్ని తగలబెట్టాడు. కొందరు రాక్షసులను హతం చేశాడు. అలా రావణాసురుడి సైన్యాన్ని కొంత తగ్గించి, రాముడికి పరోక్షంగా సహాయపడ్డాడు. ఒక దూతగా వచ్చినవాడు ఏ పని చేయాలో ఆ పనిని సక్రమంగా నిర్వర్తించాడు హనుమంతుడు. అందుకే హనుమంతుని కార్యసాధకుడు అంటారు. ప్రధాన పదవుల్లో ఉన్నవారు ఈ విధంగా బాధ్యతగా, అధికారుల పట్ల వినయవిధేయతలతో ప్రవర్తించాలని పెద్దలు చెప్తారు.

డా. పురాణపండ వైజయంతి