ఒక చిట్టడవిలో బిట్టు అనే కుందేలు ఉండేది. అది చాలా అందంగా, ముద్దుగా ఉండేది. దానికి పొగడ్తలంటే చాలా ఇష్టం. ఎవరన్నా పొగిడితే తెగ సంబరపడిపోయేది. ఒక రోజు బొరియలో నుంచి బయటకు వచ్చి దుంపలను తవ్వుకుని తింటుండగా- పొద చాటు నుంచి "బిట్టూ..” అనే పిలుపు వినిపించింది. తనను పిలిచింది ఎవరా అని తిరిగి చూసింది. అక్కడికి కొంచెం దూరంలో ఒక బక్కచిక్కిన ముసలి నక్క కనిపించింది. బిట్టు దాని వంక భయంగా చూస్తూ "ఎందుకు పిలిచాపు నన్ను?" అంది.
ముసలి నక్క నవ్వుతూ "ఏమీ లేదు బిట్టు. నిన్ను ఎప్పటినుంచో చూస్తున్నా. నువ్వు ఇంత అందంగా ఎలా ఉన్నావు? ఈ అడవిలో నీ అంత అందమైన జంతువు లేనే లేదు తెలుసా! నువ్వెంత అదృష్టవంతురాలివో... అని బిట్టుని పొగడ్తలతో ముంచెత్తింది ఆ ముసలి నక్క. ఆ మాటలతో బిట్టు మనసు ఉప్పొంగిపోయింది. ఈ అడవిలో తనకు ఎవరూ పోటీ లేరని అనుకుంటూ సిగ్గుపడింది.
అది చూసిన నక్క తన వలలో బిట్టు పడిపోయిందని సంతోషపడింది. అక్కడితో ఆగకుండా "ముసలివాడినైన నాతో ఎవరూ స్నేహం చేయడం లేదు. ఏం చేస్తాం... నా కర్మ. కనీసం నా చేత్తో నిన్ను పట్టుకునే అర్హత కూడా లేని అభాగ్యుడుని" అని బాధ నటించింది ఆ ముసలి నక్క.
ఆ మాటలతో బిట్టు జాలిపడింది. "అయ్యో దానిదేముంది నక్క తాతా. ఇక నుంచి నేను నీతో స్నేహం చేస్తా. నన్ను ఒకసారి పట్టుకోవాలని వుంది అంతేకదా! అదేమంత పని" అంటూ తింటున్న దుంపను పక్కన పడేసి ముసలి నక్క దగ్గరికి వెళ్లడానికి సిద్ధమైంది. కొంచెం దూరంలో ఉన్న తల్లి కుందేలు బిట్టుని చూసి గబగబా గెంతుతూ వచ్చింది. “ఎక్కడికి వెళ్తున్నావు ఆగు" అని బిట్టూను ఆపింది.
నక్క దగ్గరికి వెళ్తున్న బిట్టు ఆగి వెనక్కి వచ్చి "ఏమిటమ్మా పాపం! ఆ నక్క తాతకి నాతో స్నేహం చెయ్యాలని వుందట" అంది.
తల్లి కుందేలు వెంటనే బిట్టు నెత్తి మీద ఒక్క మొట్టికాయ వేసింది. “పిచ్చిదానా మనకు శత్రువైన ఆ నక్క దగ్గరకు వెళ్తావా? నీకసలు బుద్ధి లేదు. అది నిన్ను చంపి తినాలని చూస్తోంది" అంది. దానికి బిట్టు "అది కాదమ్మా సక్క తాతా ఇదివరకటిలాగా పరిగెత్తలేడు, వేటాడలేడు కదమ్మా. నన్ను ఎలా చంపుతాడు" అని అమాయకంగా అంది.
తల్లి కుందేలు కోపంగా బిట్టూని చూస్తూ "నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఇంతవరకు నిన్ను పొగిడింది ఎందుకో తెలుసా? నీ దగ్గరికి వస్తే.. సువ్వు పారిపోతావని. అది నీ వెంట వేగంగా పరిగెత్తలేదు. అందుకనినీ బలహీనత ఏమిటో తెలుసుకుంది. నిన్ను ఎవరన్నా పొగిడితే చాలు పొంగిపోతావని ఆ నక్కకి అర్ధమైంది. నీకు మాయ మాటలు చెప్పింది. సువ్వు దాని దగ్గరకు వెళ్లిన వెంటనే నీ పీక పట్టుకుని మెడ కొరికి చంపి తినేసేది" అని వివరంగా చెప్పింది. ఆ తల్లి కుందేలు.
తల్లి మాటలు విన్న తర్వాత బిట్టుకి ఒళ్లంతా వణుకుపుట్టింది. "అమ్మో, సమయానికి అమ్మ రాకపోతే నక్క తాత నన్ను చంపి తినేసేవాడు" అనుకుంది. నాలుక బయటపెట్టి ఆశగా చూస్తున్న సక్కను చూసి భయంతో ఒక్కసారిగా తల్లిని వాటేసుకున్నాడు బిట్టు, బిట్టు భయం చూసి.. ధైర్యం చెప్పి బొరియలోకి తీసుకు వెళ్లిపోయింది. తల్లి కుండేలు. నక్క తను వేసిన పథకం విఫలం అయ్యేసరికి మూలుగుతూ వెళ్లిపోయింది.
