ముంబై అండర్‌వరల్డ్.. గ్యాంగ్‌వార్స్.. ఎన్‌కౌంటర్లు.. రక్తపాతం.. ఈ పదాలు వినగానే గుర్తొచ్చే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. క్రైమ్ సినిమాలకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన ఈ సంచలన దర్శకుడు మరోసారి తనదైన స్టైల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 'కంపెనీ' సినిమాతో ఒకప్పుడు మాఫియా ప్రపంచాన్ని వెండితెరపై ఆవిష్కరించిన ఆర్జీవీ.. ఇప్పుడు 'పోలీస్ కంపెనీ'తో ముంబై అండర్‌వరల్డ్‌ను వణికించిన పోలీసుల కథను చెప్పబోతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా హర్షవర్ధన్ రాణే..
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ రాణే.. ముంబై ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ పాత్రలో కనిపించనున్నారు. నిజ జీవిత ఘటనలు, వ్యక్తుల స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ క్రైమ్ డ్రామా.. ముంబైలో గ్యాంగ్‌స్టర్లపై పోలీసుల చర్యల వెనుక ఉన్న పరిస్థితులను ఆవిష్కరించనుంది. 1997 నుంచి 2004 మధ్య ఏకంగా 319 మంది గ్యాంగ్‌స్టర్లు హతమైనట్లు పోస్టర్‌లో పేర్కొనడం సినిమాపై మరింత ఉత్కంఠను పెంచుతోంది.
'డీ కంపెనీ' కంటే డేంజర్..
వర్షంలో తడిసిన ముంబై వీధి.. చీకటి భవనాలు.. చేతుల్లో ఆయుధాలతో ముందుకు సాగుతున్న పోలీసు అధికారులు. ఇలా సాగిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు 'ఇట్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ డీ కంపెనీ' అనే ట్యాగ్‌లైన్ అదనపు ఆకర్షణగా నిలిచింది. "హింసాత్మకంగా ఉండటం వారి అర్హత.. భయపెట్టడం వారి విధానం.. నేరస్థులను వేటాడటం వారి ఉద్యోగం.. కేసును ముగించడానికి వారు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయరు.. చంపేస్తారు" అంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
పవర్‌ఫుల్ క్రైమ్ డ్రామా..
ఈ చిత్రంలో ఫర్దీన్ ఖాన్, ఫాతిమా సనా షేక్, పరేష్ రావల్, సౌరభ్ శుక్లా, మకరంద్ దేశ్‌పాండే, అశ్విని కేల్సేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించడంతో పాటు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్‌లతో కలిసి నిర్మాణంలో భాగమయ్యారు. టీ-సిరీస్ ఫిల్మ్స్, ఆర్జీవీ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 జూన్ 4న థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు..మాఫియా కథలకు కొత్త ట్రెండ్ సెట్ చేసిన వర్మ.. ఈసారి పోలీసుల ఎన్‌కౌంటర్ల వెనుక ఉన్న కథను ఎంతటి సంచలనాత్మకంగా చూపిస్తారో చూడాలి.
The POLICE is an institution and a COMPANY is a money making organisation ..But when its powers go beyond a point , a INSTITUTION will become a COMPANY ..Hence the name POLICE COMPANY https://t.co/mmbxEiAS8G
— Ram Gopal Varma (@RGVzoomin) October 21, 2026
