మీకు తెలుసా : డ్రైవ్ ఇన్ ధియేటర్ కు 100 ఏళ్లు.. ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..?

 మీకు తెలుసా : డ్రైవ్ ఇన్ ధియేటర్ కు 100 ఏళ్లు.. ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..?


ఈ రోజుల్లో కార్లలో కూర్చుని లేదా ఓపెన్ గ్రౌండ్స్‌లో సినిమాలు చూడటం ఒక కొత్త ట్రెండ్ లాగా అనిపిస్తోంది కదూ ! కానీ, ఇది నిన్న మొన్న వచ్చింది కాదు. దీని వెనుక దాదాపు 93 ఏళ్ల చరిత్ర ఉంది. అవును, మొదటి డ్రైవ్-ఇన్ థియేటర్ 1933లోనే మొదలైంది. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే... ఒక కొడుకు తన తల్లి పడుతున్న ఇబ్బందిని చూడలేక ఈ సరికొత్త థియేటర్‌ను కనిపెట్టాడు. ఆ కథేంటో ఇప్పుడు చూద్దామా....

అమ్మ సమస్యే ఒక కొత్త ఆలోచన..
ఇది అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న కామ్‌డెన్ నగరానికి చెందిన రిచర్డ్ హాలింగ్స్‌హెడ్ అనే వ్యక్తి కథ. రిచర్డ్ తల్లికి మామూలు సినిమా థియేటర్ సీట్లలో కూర్చోవడం చాలా కష్టంగా, ఇబ్బందిగా ఉండేది. అమ్మ పడుతున్న బాధను చూసి రిచర్డ్ మనసు చలించింది. ఆమె ఎలాంటి ఇబ్బంది లేకుండా, హాయిగా సినిమా చూసేలా ఏదైనా చేయాలనుకున్నాడు.

అలా వచ్చిన ఆలోచనే ఈ "డ్రైవ్-ఇన్ థియేటర్". దీనికోసం ఆయన తన ఇంటి ముందే రకరకాల ప్రయోగాలు చేశాడు. వెనక ఉన్న కార్లలో కూర్చున్న వారికి కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా... కార్లకు, స్క్రీన్‌కు మధ్య ఎంత దూరం ఉండాలి? స్క్రీన్ ఎంత ఎత్తులో ఉండాలి? అనే విషయాలపై ఎంతో రీసెర్చ్ చేశాడు. చివరకు, 1933 మే నెలలో ఈ ఐడియాకు  హక్కులు కూడా సాధించాడు.

ప్రపంచంలోనే మొదటి షో!
పేటెంట్ వచ్చిన వెంటనే, రిచర్డ్ ప్రపంచంలోనే మొట్టమొదటి డ్రైవ్-ఇన్ థియేటర్‌ను ఏర్పాటు చేశాడు. ఇందులో ఒకేసారి దాదాపు 400 కార్లు ఆపడానికి స్థలం ఉండేది. 1933 జూన్ 6న ఈ థియేటర్‌లో మొదటి సినిమాను వేశారు. ఆ రోజు ప్రదర్శించిన మొదటి సినిమా పేరు 'వైవ్స్ బివేర్' (Wives Beware), ఇది 1932 నాటి ఒక కామెడీ సినిమా.

టికెట్ రేటు ఎక్కువే... కానీ ఫుల్ ఫ్రీడమ్!
ఆ రోజుల్లో ఈ థియేటర్ టికెట్ రేట్లు చాలా ఎక్కువే అని చెప్పాలి. ఒక కారు లోపలికి వెళ్లడానికి 25 సెంట్లు, ఆ కారులో ఉన్న ప్రతి మనిషికి విడిగా ఇంకో 25 సెంట్లు వసూలు చేసేవారు.

ALSO READ : పోలీసులు నన్ను కర్రలు, పైపులతో కొట్టారు..

డబ్బులు కొంచెం ఎక్కువైనా సరే, జనాలు దీనికి బాగా అలవాటు పడ్డారు. ఎందుకంటే, మామూలు థియేటర్లలో లేని స్వేచ్ఛ ఇక్కడ దొరికింది. ఎవరి కారులో వారు హాయిగా కూర్చోవచ్చు, నచ్చిన ఫుడ్ తినొచ్చు, ఎవరికీ డిస్టర్బెన్స్ లేకుండా సిగరెట్లు కూడా కాల్చుకోవచ్చు. అందుకే జనాలకు ఇది బాగా నచ్చింది.

కేవలం 3 ఏళ్లలోనే క్లోజ్..  
ఈ ఐడియా వినడానికి చాలా బాగున్నప్పటికీ, వ్యాపారపరంగా రిచర్డ్‌కు పెద్దగా లాభాలు రాలేదు. దీంతో నష్టాలు భరించలేక కేవలం మూడేళ్లలోనే  ఆ థియేటర్‌ను మూసేయాల్సి వచ్చింది.

ఆ మొదటి థియేటర్ మూతపడినా... రిచర్డ్ తెచ్చిన ఈ కొత్త ఐడియా మాత్రం సినిమా ప్రపంచాన్ని కుదిపేసింది. ఆ స్ఫూర్తితోనే ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వందల డ్రైవ్-ఇన్ థియేటర్లు వెలిశాయి.