న్యూఢిల్లీ, వెలుగు: పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చితి, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో క్రూడాయిల్, పెట్రోలియం, వంటగ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్ది రాజు రవిచంద్ర సూచించారు. దసరా, దీపావళి సమీపిస్తున్న నేపథ్యంలో వంటగ్యాస్ వినియోగదారులకు సకాలంలో సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు.
బుధవారం పార్లమెంట్ ఆవరణలోని అనెక్స్ హాలులో పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం జరిగింది. ఈ స్టాండింగ్ కమిటీ చైర్మన్ సునీల్ దత్తాత్రే తర్కరే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ ఇంధన భద్రత, పెట్రోలియం ఉత్పత్తుల లభ్యత, వంటగ్యాస్ సరఫరా, సంబంధిత భద్రతా చర్యలపై ఆయన పలు సూచనలు చేశారు.
