ఖబడ్దార్ ..నోరు అదుపులో పెట్టుకో .. బాల్క సుమన్ పై ఎంపీ  వంశీకృష్ణ ఫైర్

 ఖబడ్దార్ ..నోరు అదుపులో పెట్టుకో .. బాల్క సుమన్ పై ఎంపీ  వంశీకృష్ణ ఫైర్

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ పై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ ల మెప్పుకోసం మంత్రి వివేక్ వెంకటస్వామిపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. కేసీఆర్ ఇంట్లో పనులు చేయడానికి పిలవడం లేదనే ఫ్రస్టేషన్ లోనే సుమన్ ఇలాంటి అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.

ఆపద వస్తే కాళ్లు మొక్కడం, ఆ తర్వాత చిల్లర మాటలు మాట్లాడడం, అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టడం బాల్క సుమన్ కి వెన్నతో పెట్టిన విద్య అని ఎంపీ వంశీకృష్ణ దుయ్యబట్టారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి అభివృద్ధి కోసం ఏనాడైనా పాటుపడ్డావా అని నిలదీశారు. కేవలం దాడులు, మహిళలపై అరాచకాలు, ఇసుక భూదందాలు, సెటిల్మెంట్లు చేయడం తప్ప సుమన్ ఒరగబెట్టింది ఏమీ లేదని ఆరోపించారు. నోరు ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని, మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, లేదంటే ప్రజలు మరోసారి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.