WorkFromHome Review: మోడీ ప్రస్తావించిన కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ రివ్యూ ఇదే

WorkFromHome Review: మోడీ ప్రస్తావించిన కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ రివ్యూ ఇదే

ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో  వైవిధ్యమైన, భిన్నమైన కాన్సెప్ట్‌లతో మేకర్స్ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఈ కోవలోనే మధుదీప్ చెలికాని దర్శకత్వంలో సరికొత్త కథాంశంతో రూపొందిన చిత్రం 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, టీజర్, మరియు పాటలకు ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వినూత్నమైన టైటిల్‌తోనే సినిమాపై అంచనాలను భారీగా పెంచేలా చేశారు మేకర్స్. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకుంది? ప్రేక్షకుల మనసును ఎలా ఆకట్టుకుంది? అనేది రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే:

అరవింద్ (త్రిగుణ్) అమెరికాలో లగ్జరీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలేసి, స్వదేశానికి తిరిగి వస్తాడు. ఇక్కడకు వచ్చాక కేవలం ఉద్యోగానికే పరిమితం కాకుండా సొంతంగా సమాజానికి ఉపయోగపడే ఏదైనా చేయాలని గట్టిగా నిశ్చయించుకుంటాడు. ఈ క్రమంలోనే రసాయన ఎరువుల అతిగా వాడకం కారణంగా భూములు ఎలా నిస్సారమవుతున్నాయో, ప్రస్తుత సమాజంలో మనుషులు ఈ రసాయన ఎరువుల వల్ల పండిన పంటలను తినడం వల్ల వారి ఆయుష్షు ఎలా తగ్గిపోతుందో అరవింద్ గుర్తిస్తాడు.

దీనిని మార్చడం కోసం అరవింద్ ఆర్గానిక్ (సేంద్రీయ) వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. వ్యవసాయంలో సరికొత్త సాంప్రదాయ పద్ధతులను ప్రవేశపెట్టడమే కాకుండా, రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి వీలుగా ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే ఒక ప్రత్యేకమైన యాప్‌ను తీసుకువస్తాడు. ఈ ప్రయాణంలో మహి (పాయల్ రాధాకృష్ణ) అనే అమ్మాయితో అరవింద్ ప్రేమలో పడతాడు. అయితే అతను స్థిరమైన ఉద్యోగం చేయడం లేదనే కారణంతో అతని ప్రేమను అంగీకరించడానికి మహి నిరాకరిస్తుంది.

మరి ఈ పరిస్థితుల్లో అరవింద్ వ్యవసాయంలో తనతో పాటు మిగతా రైతుల తలరాతను ఎలా మార్చాడు? మహి అతని ఆశయాలను అర్థం చేసుకుని తన మనసు మార్చుకుందా? చివరకు వారి కథ ఎలా ముగిసింది? అనేదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. 

విశ్లేషణ:

దర్శకుడు మధుదీప్ చెలికానీ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే టైటిల్‌తోనే సినిమాపై మొదటి నుంచి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. సాధారణంగా ఇలాంటి టైటిల్ వినగానే ఇదొక సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి సంబంధించిన కథ అనుకుంటారు. ఇందులో కూడా హీరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగే అయినప్పటికీ, ఆ జాబ్ బోరింగ్‌గా అనిపించి కొత్తగా దేశం కోసం ఏదైనా చేయాలనుకునే పాయింట్‌ను అద్భుతంగా ముడిపెట్టారు.

మారుతున్న నేటి జీవనశైలి వల్ల చాలా మందికి 40 ఏళ్ల లోపే షుగర్, బీపీ సహా గుండె జబ్బులు చుట్టుముడుతున్నాయి. వీటన్నింటికీ కారణం మన పూర్వీకులు తీసుకున్న ఆహారాన్ని మనం తీసుకోకపోవడమేనని దర్శకుడు బాగా చూపించారు. అప్పట్లో ఎలాంటి రసాయన ఎరువులు లేకుండా సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో పండించిన పంటలను తిన్న మన పెద్దవాళ్లు ఎంతో ఆరోగ్యంగా, చలాకీగా ఉండేవారు. కానీ నేటి తరానికి మిల్లెట్ల (చిరుధాన్యాల) ఆవశ్యకతను ఎవరు సరిగా వివరించడం లేదు.

ఇందులో హీరో కూడా వ్యవసాయంలో మళ్లీ సాంప్రదాయ, కొత్త పద్ధతులను ప్రవేశపెట్టి, తక్కువ పెట్టుబడితో, అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ఎక్కువ దిగుబడులు ఎలా సాధించవచ్చో చూపించాడు.

టెక్నీకల్ అంశాలు:

ఈ సినిమా టెక్నీకల్ గా అన్ని విధాలుగా చాలా బాగుంది. గతంలో మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమాలో కూడా రైతుల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు, ఈ సినిమా కూడా అదే విధంగా రైతుల గురించి ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. రైతులు కూడా ఎరువులు వాడి వాడి భూములు నిస్సారమయ్యాక, వాటిని ఫ్లాట్లుగా విక్రయిస్తున్న ప్రస్తుత చేదు వాస్తవాన్ని ఇందులో ప్రస్తావించారు. 

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్, ఢిల్లీ పర్యటనల్లో 'వర్క్ ఫ్రమ్ హోమ్' గురించి కీలక వ్యాఖ్యలు చేయడం, ఏపీ ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో, ఈ సినిమాను అదే కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం. 

ప్రధాని మాట్లాడిన కొద్ది రోజుల్లోనే వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా, అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉంది. అలాగే సినిమాలోని మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. డీఓపీ (సినిమాటోగ్రఫీ) విజువల్స్ అద్భుతంగా ఉండి సినిమాను రిచ్‌గా మార్చాయి.

నటీనటుల పనితీరు:

హీరోగా త్రిగుణ్ తన నటనతో ఎంతగానో మెప్పించాడు. స్క్రీన్‌పై కొన్ని యాంగిల్స్‌లో అతని చూస్తుంటే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గుర్తుకు వస్తాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో త్రిగుణ్ చాలా బాధ్యతతో కూడిన నటనను కనబరిచాడు.

హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ స్క్రీన్‌పై ఎంతో అందంగా కనిపించడమే కాకుండా తన పాత్ర పరిధి మేర చక్కగా నటించింది. హీరో తండ్రి పాత్రలో నటించిన అవినాష్ కురువిల్లా, అలాగే హీరోను ఆర్గానిక్ వ్యవసాయం వైపు నడిపించే కీలక పాత్రలో నటించిన సీనియర్ నటుడు శివాజీ రాజా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మిగిలిన నటీనటులు కూడా తమ పరిమితుల మేరకు నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఫైనల్ గా:

ఫైనల్లీ, 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' అనేది కేవలం ఒక కమర్షియల్ సినిమా మాత్రమే కాదు.. సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తూనే ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే ఒక చక్కటి చిత్రం. ఆహారపు అలవాట్లు, వ్యవసాయ ప్రాముఖ్యతను గుర్తుచేసే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా యువత తప్పక చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.