ధోనీకి నో ఛాన్స్?: కెప్టెన్‌గా అదుర్స్, కోచ్‌గా మాత్రం వద్దు.. CSK హెడ్ కోచ్‌గా అతడే బెస్ట్

ధోనీకి నో ఛాన్స్?: కెప్టెన్‌గా అదుర్స్, కోచ్‌గా మాత్రం వద్దు.. CSK హెడ్ కోచ్‌గా అతడే బెస్ట్

CSK New Coach: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు గత 18 సీజన్లుగా తమ హెడ్ కోచ్‌గా వ్యవహరించిన స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో విడిపోయిన తర్వాత కొత్త కోచ్ వేటను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ 2019 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సీఎస్‌కే నయా కోచ్‌గా వచ్చే అవకాశం ఉందంటూ భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మోర్గాన్ పేరు ప్రాంచైజీ వర్గాల్లో బలంగా వినిపిస్తోందని, దీనిపై ప్రాథమిక చర్చలు కూడా జరుగుతున్నాయని అశ్విన్ వెల్లడించాడు.

మోర్గాన్, మెక్‌కలమ్ వద్దే వద్దు: శ్రీకాంత్ 

రవింద్రన్ అశ్విన్ ప్రతిపాదనను భారత జట్టు మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన ఆయన.. ఇయాన్ మోర్గాన్‌ను కానీ, బ్రెండన్ మెక్‌కలమ్‌ను కానీ సీఎస్‌కే హెడ్ కోచ్‌గా అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. మోర్గాన్ ఇంగ్లాండ్‌కు మంచి కెప్టెనే కావచ్చు కానీ, ఐపీఎల్‌లో కేకేఆర్ కెప్టెన్‌గా గొప్పగా ఏమీ సాధించలేదని, అతడు కా కామెంట్రీకే పరిమితమైతే బెటర్ అని శ్రీకాంత్ ఎద్దేవా చేశారు.

మైఖేల్ హస్సీయే పర్ఫెక్ట్ ఛాయిస్: 

బయట నుంచి ఎవరినో తీసుకురావాల్సిన అవసరం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు లేదని, ప్రస్తుతం జట్టు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న మిస్టర్ క్రికెట్ మైఖేల్ హస్సీనే ఆటోమేటిక్‌గా హెడ్ కోచ్‌గా నియమించాలని శ్రీకాంత్ సూచించారు. హస్సీకి సీఎస్‌కే సంస్కృతిపై సంపూర్ణ అవగాహన ఉందని, జట్టును నడిపించేందుకు అతడే అత్యుత్తమ ఎంపిక అని పేర్కొన్నారు. కేకేఆర్‌ను 2021లో ఫైనల్‌కు తీసుకెళ్లిన అనుభవం మెక్‌కలమ్‌కు ఉన్నప్పటికీ, ఆయన శైలి సీఎస్‌కేకు సరిపోదని అభిప్రాయపడ్డారు.

ముందు ఎంఎస్ ధోనీ రోల్ తేలాలి: 

కొత్త కోచ్ నియామకానికంటే ముందు చెన్నై జట్టులో ది గ్రేట్ మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్తు ఏంటి అనేది తేలాలని మాజీ క్రికెటర్ శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ధోనీ పాత్ర ఏంటి? అతడు ఏ హోదాలో ఉంటాడు? అనే విషయంపై ముందుగా స్పష్టత రావాలని చెప్పారు. ధోనీ రోల్‌పై క్లారిటీ వచ్చిన తర్వాతే కొత్త హెడ్ కోచ్ నియామకం, జట్టు భవిష్యత్తు ప్రణాళికలు ముందుకు కొనసాగుతాయని క్రిష్ స్పష్టం చేశారు.