Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై పేలవ ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించిన కొద్ది రోజులకే హార్దిక్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అకౌంట్‌ను డిలీట్( డీయాక్టివేట్) చేయడం క్రికెట్ ప్రపంచంలో సంచలనం రేపుతోంది. ఇటీవల అతను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులోకి మారబోతున్నాడనే ప్రచారం జోరందుకున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
హార్దిక్ అకౌంట్ మాయం.. షాక్‌లో ఫ్యాన్స్:
కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్న హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్ పేజీ హఠాత్తుగా కనిపించకుండా పోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం అతని ప్రొఫైల్‌ను సెర్చ్ చేస్తే 'యూజర్ నాట్ ఫౌండ్' అని వస్తోంది. హార్దిక్ లేదా అతని మేనేజ్‌మెంట్ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.. కానీ, ఐపీఎల్ ముగిసిన వెంటనే అతను సోషల్ మీడియాకు దూరం కావడం వెనుక గల కారణాలపై నెటిజన్లు, క్రికెట్ అభిమానులు రకరకాలుగా వార్త కథనాలు వినిపిస్తున్నాయి.
ముంబై ఘోర పరాజయం:
భారీ అంచనాలతో ఐపీఎల్ 2026 బరిలోకి దిగిన ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ సీజన్ ఒక పీడకలలా మిగిలిపోయింది. సీజన్ అంతటా నిలకడలేని ఆటతీరుతో తడబడిన ముంబై.. చివరకు పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో లీగ్ నుంచి వైదొలగింది. జట్టు పేలవ ప్రదర్శనతో పాటు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లోపాలపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ భారీ ఒత్తిడి వల్లే హార్దిక్ సోషల్ మీడియా అకౌంట్‌ను క్లోజ్ చేసి ఉండవచ్చని సమాచారం.
సీఎస్‌కే ట్రేడింగ్ వార్తలకు బలం:
హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కనిపించకుండా పోవడానికి కొన్ని రోజుల ముందే.. అతను చెన్నై జట్టులోకి మారబోతున్నాడనే వార్తలకు బలం చేకూర్చేలా కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. హార్దిక్ ఇటీవల నెట్టింట షేర్ చేసిన ఒక ఫోటోలో ఫోన్ స్క్రీన్‌పై సమయం "07:07" గా ఉంది. '7' నంబర్ అనగానే క్రికెట్ ప్రపంచానికి గుర్తొచ్చేది టీమిండియా లెజెండ్, మాజీ సీఎస్‌కే కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ (MS Dhoni).. ఈ పోస్ట్‌తో హార్దిక్ వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి సీఎస్‌కే గూటికి చేరబోతున్నాడనే రూమర్లు అభిమానుల్లో ఒక్కసారిగా ఊపందుకున్నాయి.
