హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పట్టణీకరణను క్రమబద్ధీకరించడానికి, సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన 'తెలంగాణ కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ రూల్స్, 2020' గడువును మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ కమిషనర్ పంపిన నివేదికను, అభ్యర్థనను ప్రభుత్వం నిశితంగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీవో 950 విడుదల చేశారు.
2020 నవంబర్ 3న జారీ చేసిన జీవో 189 ప్రకారం అమల్లోకి వచ్చిన ఈ విధానాన్ని, ప్రస్తుత అవసరాల దృష్ట్యా మరో 5 సంవత్సరాల పాటు కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2008, కోర్ అర్బన్ రీజియన్ యాక్ట్ 2026, తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019 పరిధిలోని అధికారాలను ఉపయోగించి ప్రభుత్వం ఈ గడువును పెంచింది.
