MVSR బీటెక్ కాలేజ్లో లైటింగ్ ట్రస్ కూలిన ఘటనలో కీలక పరిణామం

MVSR బీటెక్ కాలేజ్లో లైటింగ్ ట్రస్ కూలిన ఘటనలో కీలక పరిణామం

రంగారెడ్డి జిల్లా ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో లైటింగ్ ట్రస్ కూలిన ఘటనలో ముగ్గురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో దసరా సందర్భంగా నిర్వహించిన దాండియా కార్యక్రమంలో ఇనుప ట్రస్ నిర్మాణం కూలిన ఘటనలో ఒక యువతి చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితులుగా ఉన్న ముగ్గురు ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. అక్టోబర్ 17వ తేదీన ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 22 మంది విద్యార్థినులు గాయపడ్డారు.

చికిత్స పొందుతూ నారాయణదాస్ సోనా అనే విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో ఈవెంట్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న నిర్వాహకులు.. సబ్ కాంట్రాక్టర్లు.. ఇనుప ట్రస్ నిర్మాణం చేపట్టిన వ్యక్తుల నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. నాలుగు పిల్లర్లతో ఏర్పాటు చేయాల్సిన ఇనుప ట్రస్‌ను కేవలం రెండు పిల్లర్లతోనే ఏర్పాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

అంతేకాకుండా నిర్మాణ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, వాతావరణ పరిస్థితులను సరిగా అంచనా వేయకపోవడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మల్లెల సాకేత్, బత్తుల పునీత్, సాయం నిశాంత్ యాదవ్‌లు ఈ నెల 20వ తేదీన ఆదిభట్ల పోలీసుల ఎదుట లొంగిపోయారు. 

వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ఈవెంట్ నిర్వహణ ఒప్పంద పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి సుమారు 19 మీటర్ల పొడవైన గోల్ ట్రస్ నిర్మాణంతో పాటు అనుమతులు లేని డీజే సౌండ్ సిస్టమ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.