Nagabandham Review: మైథికల్ థ్రిల్లర్ ‘నాగబంధం’ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

Nagabandham Review: మైథికల్ థ్రిల్లర్  ‘నాగబంధం’ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

‘పెదకాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన మైథికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం’ (Nagabandham). సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి ఎన్‌ఐకే స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నాగబంధం ద్వారా రక్షించబడుతున్నట్లు చెబుతున్న 108 విష్ణు దేవాలయాల నేపథ్యాన్ని కథకు ప్రధాన ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటించగా, లీలావతి పాత్రలో అనసూయ కీలకమైన మిస్టీరియస్ రోల్‌లో కనిపించారు. చారిత్రక అంశాలు, పురాణ నేపథ్యం, మిస్టరీ, అడ్వెంచర్‌ల మేళవింపుతో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం శుక్రవారం  (జులై 3, 2026న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ఒక రోజు ముందుగానే గురువారం రాత్రి పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలను కూడా ప్రదర్శించారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గ్రాండ్ విజువల్స్, మైథాలజీ టచ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన మేకర్స్, సినిమాతో ఎలాంటి అనుభూతిని అందించారు? కథలో ఉత్కంఠ రేపే మిస్టికల్ అంశాలు ఏమిటి? ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఎలాంటి స్పందన వ్యక్తం చేస్తున్నారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కథేంటంటే..

1756 నుంచి 1962 మధ్య ఈ కథ సాగుతుంది. ఆర్కియాలజిస్ట్‌ ప్రభాకర్ పాత్రలో (జగపతి బాబు) నటించారు. ప్రభాకర్ తన పరిశోధనల్లో ఎన్నో చారిత్రక రహస్యాలను ఛేదించినప్పటికీ, నాగబంధం అనే మర్మాన్ని మాత్రం వెలికితీయలేకపోతాడు. ఆ రహస్యాన్ని ఛేదించే బాధ్యతను ఆయన శిష్యులు టెస్లా, అలీ (రిషబ్ సాహ్నీ) తీసుకుంటారు. ఈ క్రమంలో వారి పరిశోధనలు హిమాలయాల వరకు చేరుతాయి.

అక్కడ ఎన్నో ఏళ్లుగా బంధించబడి ఉన్న భైరాగి (గరుడ రామ్) ప్రభావానికి లోనైన అలీ, నాగబంధాన్ని విముక్తి చేసి అపారమైన శక్తిని సొంతం చేసుకుని ప్రపంచాన్ని శాసించాలని సంకల్పిస్తాడు. అందుకోసం శ్రీరంగనాథ స్వామి ఆలయంలోని పవిత్రమైన బ్రహ్మకమలాన్ని చేజిక్కించుకునే ప్రయత్నంలో ఎన్నో దారుణాలకు పాల్పడతాడు.

మరోవైపు తులసీవనం గ్రామంలో సాధారణ యువకుడిగా జీవిస్తున్న రుద్ర (విరాట్ కర్ణ) అనుకోని పరిస్థితుల్లో ఈ మర్మమైన ప్రయాణంలో భాగమవుతాడు. అసలు బ్రహ్మకమలం ఎవరి చేతికి చేరింది? రుద్రకు దానితో ఉన్న అనుబంధం ఏమిటి? పార్వతి (నభా నటేష్) పాత్ర వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి? 17వ శతాబ్దపు నాగసాధువు శివతో రుద్రకు ఉన్న సంబంధం ఏమిటి? చివరకు భైరాగి నాగబంధాన్ని విముక్తి చేయగలిగాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ‘నాగబంధం’ కథ. 

ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే?

‘నాగబంధం’ మూవీకి పాజిటివ్ టాక్ తో పాటు మిక్సెడ్ టాక్ సైతం వస్తుంది. మైథాలజీ, సనాతన ధర్మం, గ్రాండ్ విజువల్స్, వీఎఫ్‌ఎక్స్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులకు ఓ మంచి విజువల్ ట్రీట్ ఇస్తుందని కొందరు ఆడియన్స్ ట్వీట్ చేస్తున్నారు. ముఖ్యంగా కెమెరా వర్క్, యాక్షన్ సీక్వెన్స్‌లు, క్లైమాక్స్ ఎపిసోడ్‌లు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయనిం అంటున్నారు. నాగబంధం రహస్యాన్ని పరిచయం చేసే ఓపెనింగ్ సీన్స్, ఇంటర్వెల్ ట్విస్ట్ ఆసక్తిని పెంచుతాయని ట్వీట్స్ పెడుతున్నారు.

అయితే, బలమైన కథ, భావోద్వేగాల కంటే విజువల్ హంగులపైనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టినట్లు మరికొందరు అంటున్నారు. కొన్ని ట్రాక్‌లు, పాత్రలు కథకు పెద్దగా ఉపయోగపడకపోవడం, సెకండాఫ్‌లో కథనం నెమ్మదించడం కొంత నిరాశపరుస్తాయని ట్వీట్స్ పెడుతున్నారు. అయినప్పటికీ 1756 నేపథ్యంలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, ప్రీ-క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మొత్తంగా ‘నాగబంధం’ విజువల్స్, మైథికల్ అడ్వెంచర్‌లను ఆస్వాదించే వారికి కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా చూసిన ఓ ఆడియన్ తన రివ్యూ షేర్ చేస్తూ.. ‘‘మైథికల్ థ్రిల్లర్ బాగుంది. సినిమాలో ముఖ్యంగా హీరో విరాట్ కర్ణ తన నటనతో ఆకట్టుకున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా చివరి 20 నిమిషాల్లో ఆయన నటన మరో స్థాయిలో ఉందని, దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కించిన విజువల్స్ టాప్ క్లాస్‌గా ఉన్నాయని, ముఖ్యంగా 'నమో రే' పాట అద్భుతంగా చిత్రీకరించారని ట్వీట్ చేశారు. అలాగే నిర్మాణ విలువలు తెరపై గ్రాండ్‌గా కనిపించాయని, భారీ స్థాయిలో రూపొందించిన విజువల్స్ ప్రేక్షకులకు కనుల విందుగా నిలిచాయని.. ఇక హీరోయిన్ నభా నటేష్ కూడా తన పాత్రలో చక్కటి నటన కనబర్చిందని’’ సోషల్ మీడియాలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

మరో ఆడియన్ ట్వీట్ చేస్తూ తనదైన శైలిలో రివ్యూ పంచుకున్నారు. ‘‘దేవుళ్లు, పురాణాల నేపథ్యంతో సినిమాలు తీస్తే కేవలం గ్రాండ్ విజువల్స్ సరిపోవని, వాటికి బలమైన కథ, భావోద్వేగాలు కూడా తోడవ్వాలని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. 'నాగబంధం'లో సినిమాటోగ్రఫీ, భారీ నిర్మాణ విలువలు, కొన్ని వీఎఫ్‌ఎక్స్ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ, కథనం మాత్రం పూర్తిగా నిరాశపరిచిందని పేర్కొన్నారు. దర్శకుడు అభిషేక్ నామా సినిమా స్కేల్‌ను అద్భుతంగా చూపించినా, రచన విషయంలో మాత్రం వెనుకబడ్డారని వ్యాఖ్యానించారు.

అలాగే నటీనటుల ఎంపిక, అధిక నిడివి కూడా సినిమాకు మైనస్‌గా మారాయని, గ్రాండ్ విజువల్స్ మాత్రమే సినిమా విజయానికి సరిపోవని ఈ చిత్రం మరోసారి నిరూపించిందని అభిప్రాయపడ్డారు. మొత్తంగా 'నాగబంధం' భారీ స్థాయిలో తెరకెక్కినప్పటికీ ప్రేక్షకులను పూర్తిగా అలరించడంలో విఫలమైందని’’ఆ నెటిజన్ ట్వీట్ చేశారు."