Nagarjuna Birthday Special : కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌.. నాగార్జున 100వ సినిమా టైటిల్‌ ఖరారు.. ఫస్ట్‌ గ్లింప్స్‌ అదుర్స్‌!

Nagarjuna Birthday Special : కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌.. నాగార్జున 100వ సినిమా టైటిల్‌ ఖరారు.. ఫస్ట్‌ గ్లింప్స్‌ అదుర్స్‌!

టాలీవుడ్‌లో 'కింగ్‌'గా తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న అక్కినేని నాగార్జున కెరీర్‌లో మరో మైలురాయి మొదలైంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆయన 100వ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ వచ్చేశాయి. ఈ  రోజు ( ఆగస్టు 29, 2026 ) ఈ వెండితెర సోగ్గాడి 67వ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ ఈ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న  ‘#KING100’  వర్కింగ్ టైటిల్ నే అధికారికంగా 'కింగ్‌100' పేరుతో  ఈ సినిమా టైటిల్ ను ఖారారు చేశారు. స్పెషల్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది

గ్లింప్స్‌లో నాగార్జున కనిపించిన తీరు సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. స్టైలిష్‌, మేజెస్టిక్‌ లుక్‌లో ఆయన స్క్రీన్‌పై కనిపించగానే అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. వయసు పెరుగుతున్నా.. తన స్క్రీన్‌ ప్రెజెన్స్‌లో మాత్రం ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టుగా నాగ్‌ మరోసారి తన చార్మ్‌తో అదరగొట్టారు. ముఖ్యంగా "మనుషుల్లో రెండు రకాలు.. ఒకటి డబ్బున్నోళ్లు, రెండు డబ్బులేనోళ్లు" అంటూ ఆయన చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలిచింది.

తమిళ దర్శకుడు రా.కార్తీక్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. డబ్బు, హోదా, సమాజంలో గుర్తింపు చుట్టూ సాగే కథలో తండ్రీకూతుళ్ల అనుబంధం కీలకమైన ఎమోషనల్‌ ఎలిమెంట్‌గా ఉండనుందని తెలుస్తోంది. ర్యాగ్స్‌ టు రిచెస్‌ నేపథ్యంలో హీరో ప్రయాణం, తన గుర్తింపు కోసం చేసే పోరాటం కథలో ఆసక్తికరమైన మలుపులు తీసుకురానున్నాయి.

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి గ్లింప్స్‌లోని విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అదనపు బలంగా నిలిచాయి. టబు, సుష్మితా భట్‌, విజయేంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం 2026 డిసెంబర్‌ 24న థియేటర్లలో సందడి చేయనుంది. నాగార్జున 100వ సినిమా కావడంతో ఈ 'కింగ్‌100'పై అభిమానుల్లోనూ, ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.