King 100 : నాగార్జున వర్సెస్ టబు.. 'కింగ్100' నుంచి దసరా స్పెషల్ సర్‌ప్రైజ్!

King 100 : నాగార్జున వర్సెస్ టబు.. 'కింగ్100' నుంచి దసరా స్పెషల్ సర్‌ప్రైజ్!

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్'కింగ్ 100'.  ఇప్పటికే నాగార్జున 100 వ సినిమాగా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో దీనిపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసింది. సీనియర్ నటి టబు ఈ చిత్రంలో అత్యంత శక్తిమంతమైన ప్రతినాయిక పాత్రలో కనిపించనుంది. ఆమె పాత్రను పరిచయం చేస్తూ దసరా పండుగ సందర్భంగా ప్రత్యేకమైన పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జున, టబు కలిసి తెరపై కనిపించనుండటం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. గతంలో 'నిన్నే పెళ్లాడుతా' వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ జోడీ.. ఈసారి మాత్రం ప్రేమకథతో కాకుండా, హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా నాగార్జునకు జోడీగా కాకుండా, ఆయనను ఢీకొట్టే బలమైన ప్రతినాయికగా టబు కనిపించనుండటం మరింత ఆసక్తిని పెంచుతోంది.

టబు పాత్రలో నెగెటివ్ షేడ్స్, పదునైన వ్యూహాలు, కథను మలుపుతిప్పే కీలకమైన అంశాలు ఉండనున్నాయనే అంచనాలు అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి. ఆమె లుక్, బాడీ లాంగ్వేజ్, పాత్ర స్వభావాన్ని ప్రతిబింబించేలా గ్లింప్స్‌ను రూపొందిస్తే.. సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేరడం ఖాయం. 

ఆర్. కార్తీక్ దర్శకత్వంలో అన్నపూర్ణా స్టూడియోస్, మనమ్ ఎంటర్‌ప్రైజెస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, అశోక్ సెల్వన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో భారీ ఆర్థిక కుంభకోణం, రాజకీయ ఉద్రిక్తతలు, యాక్షన్ అంశాలు ఆకట్టుకున్నాయి. ఒక సామాన్యుడు స్వశక్తితో రూ. 50,000 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించి 'ది కింగ్'గా ఎదిగే అసాధారణ ప్రయాణాన్ని ఆవిష్కరిస్తోంది.

2026 డిసెంబర్ 24న విడుదల కానున్న 'కింగ్ 100'లో నాగార్జున వర్సెస్ టబు పోరు ఏ స్థాయిలో ఉండబోతోందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దసరా గ్లింప్స్‌తో ఈ కింగ్‌ వార్‌కు మేకర్స్ ఎలాంటి కిక్ ఇస్తారో చూడాలి..