నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కు మేయర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం నగర అభివృద్ధికి మంచి సంకేతమని, శుభ సూచికమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ మేయర్ కార్యాలయ సమావేశ మందిరంలో నగర మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నల్గొండ కార్పొరేషన్ పరిధిలోని 48 మంది కార్పొరేటర్లకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
అధికారంలో ఉన్నంత కాలం కార్పొరేటర్లు ప్రజలకు అంకితభావంతో సేవ చేయాలని మంత్రి సూచించారు. ఏ సమస్య వచ్చినా ముందుగా మేయర్ దృష్టికి, అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. రాజకీయ విభేదాలు పక్కనపెట్టి అన్ని పార్టీల కార్పొరేటర్లు అభివృద్ధి కోసం ఏకమవ్వాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, ఎంఐఎం ఎమ్మెల్సీ ఆఫన అలీ, నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
