యువ ఐపీఎస్‌‌ల చేతుల్లోనే దేశ భద్రత  : గోవింద్‌‌ మోహన్‌‌  

యువ ఐపీఎస్‌‌ల చేతుల్లోనే దేశ భద్రత  : గోవింద్‌‌ మోహన్‌‌  
  • నార్కొటిక్స్‌‌, సైబర్ నేరాలు, సోషల్‌‌ మీడియా పోలీసుల ముందున్న సవాళ్లు
  • కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్‌‌ మోహన్‌‌ 
  • నేషనల్ పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ ఐపీఎస్‌‌ల దీక్షాంత్‌‌ పరేడ్‌‌కు హాజరు 

హైదరాబాద్‌‌, వెలుగు: దేశ భద్రత- యువ ఐపీఎస్‌‌ల చేతుల్లోనే ఉందని, భవిష్యత్తులో నార్కొటిక్స్, సైబర్‌‌‌‌ నేరాలు తీవ్ర స్థాయికి చేరే ప్రమాదం ఉన్నందున వాటిని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్‌‌ మోహన్‌‌ సూచించారు. 78వ రెగ్యులర్ రిక్రూట్‌‌(ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌) ఐపీఎస్‌‌ల పాసింగ్‌‌ అవుట్ పరేడ్‌‌ సందర్భంగా శనివారం రాజేంద్రనగర్‌‌‌‌లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్‌‌ నేషనల్ పోలీస్ అకాడమీలో దీక్షాంత్ పరేడ్ జరిగింది.

ఈ కార్యక్రమానికి గోవింద్‌‌ మోహన్‌‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 45 వారాల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 37 మంది మహిళా ఆఫీసర్లు సహా మొత్తం135 మంది ఇండియన్ పోలీస్ సర్వీస్‌‌ (ఐపీఎస్‌‌), 16 మంది నేపాల్‌‌, రాయల్ భూటాన్‌‌, మాల్దీవులకు చెందిన ఫారిన్‌‌ ఆఫీసర్ల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అవుట్‌‌డోర్‌‌‌‌ శిక్షణలో ప్రతిభ కనబరిచిన గుజరాత్ కేడర్‌‌‌‌కు చెందిన కుహ్‌‌గార్గ్‌‌కు ఐపీఎస్ అసోసియేషన్‌‌ స్వార్డ్‌‌ అందించారు.

పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మరో ఆరుగురు ప్రొబేషనరీ ఐపీఎస్‌‌లకు ట్రోఫీలు బహూకరించారు. దీక్షాంత్‌‌ పరేడ్ అనంతరం ప్రొబేషనరీ ఐపీఎస్‌‌లకు దిశానిర్దేశం చేశారు. తొలుత కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షా ప్రసాంగాన్ని చదివి వినిపించారు. ఈ క్రమంలోనే దేశ ప్రజలకు భద్రత, రక్షణ, భరోసా కల్పించడం యువ ఐపీఎస్‌‌ల ప్రధాన బాధ్యత అని అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా దేశం ఎదుర్కొంటున్న అంతర్గత భద్రతా పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయన్నారు.

ట్రెడిషనల్ క్రైమ్‌‌ తగ్గినప్పటికీ దేశంలో నార్కొటిక్స్, సైబర్ నేరాలు పెరిగిపోయాయని చెప్పారు. గత 50 ఏండ్లుగా వామపక్ష తీవ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాట్లు, స్వదేశీ, విదేశీ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నామని తెలిపారు. దేశంలో మావోయిజం ముగింపు దశకు చేరుకున్నదన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కాల్పుల విరమణ ఒప్పందాలు, ఆపరేషన్ల నిలిపివేత, త్రైపాక్షిక ఒప్పందాల ద్వారా తిరుగుబాటు గ్రూపులు శాంతియుత స్రవంతిలోకి వచ్చాయని తెలిపారు. స్వదేశీ టెర్రరిజం తగ్గినప్పటికీ, పూర్తిగా అంతరించిపోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు ఘటన దేశంలో ఇంకా టెర్రరిజం ముప్పును సూచిస్తోందని వెల్లడించారు.

యువ ఐపీఎస్‌‌ల ముందు ఆరు సవాళ్లు.. 

కొత్తగా ఇండియన్ పోలీస్‌‌ సర్వీస్‌‌లోకి చేరుతున్న యువ ఐపీఎస్ బ్యాచ్‌‌కు రాబోయే రోజుల్లో పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉందని గోవింత్‌‌ మోహన్‌‌ అన్నారు. ఈ మేరకు దేశంలో పెరిగిపోతున్న డ్రగ్స్‌‌ నియంత్రణ, సైబర్ నేరాలు, టెర్రరిజం, విదేశీయులు అక్రమ వలసలు, డార్క్ నెట్ ద్వారా సుపారీ హత్యలు, విదేశాలకు డబ్బు తరలింపు వంటి ఆరు అంశాలు దేశ అంతర్గత భద్రతకు ప్రమాదంగా మారాయని చెప్పారు. వీటిని అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ఏఐ వంటి టెక్నాలజీలను పోలీసింగ్‌‌లో సమర్థంగా వినియోగించాలని సూచించారు. సోషల్‌‌ మీడియాను అనుక్షణం పర్యవేక్షించడంతో పాటు ప్రజలకు భద్రత, రక్షణ, భరోసా కల్పించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.