OTT Review: రెండు OTT ల్లోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్: క్షుద్ర పూజలు, పిల్లి మాయతో భయపడాల్సిందే..

OTT Review: రెండు OTT ల్లోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్: క్షుద్ర పూజలు, పిల్లి మాయతో భయపడాల్సిందే..

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర నటించిన రీసెంట్ సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ (HONEY). పలాస మూవీ డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 6, 2026న ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంది. సమాజంలోని చీకటి కోణాలను, మూఢనమ్మకాలు మరియు అంధ విశ్వాసాల వెనుక దాగి ఉన్న భయానక నిజాలను ఆవిష్కరించేలా ఈ సినిమా రూపుదిద్దుకుంది.

థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల్లో భారీ ఇంపాక్ట్ తీసుకొచ్చిన ‘హనీ’.. ఇపుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇందులో నవీన్ చంద్రతో పాటుగా  దివ్య పిళ్లై, బిగ్‌బాస్ ఫేమ్ దివి, రాజా రవీంద్ర ఇతర పాత్రల్లో నటించి భయపెట్టారు. 

‘హనీ’ ఓటీటీ: 

తెలుగు డార్క్ హారర్ థ్రిల్లర్గా వచ్చిన ‘హనీ’ కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎదురుచూస్తూ వస్తున్నారు. ఇవాళ (ఫిబ్రవరి 27న) ఏకంగా రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లలో స్ట్రీమింగ్కి వచ్చి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్ట్స్ ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతోంది. అయితే, ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా అందుబాటులో ఉంది. సన్ నెక్ట్స్లో కేవలం తెలుగు, తమిళంలో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది.  

క్షుద్ర పూజలు, దెయ్యాలపై వచ్చిన గత చిత్రాలకు భిన్నమైన సినిమా ఇది. మూఢ నమ్మకాలు, క్షుద్ర ఆరాధనలు మనిషిని ఎంతలా దిగజారుస్తాయి.. తనను, తనను నమ్ముకున్న కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తాయి అనేది ప్రధానంగా ఈ చిత్రం ద్వారా చెప్పదలచుకున్నారు.

మదనపల్లిలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్‌ స్ఫూర్తితో దర్శకుడు కరుణ్ కుమార్ ఈ కథ రాసుకున్నారు. ఇందుకు దేవాంగ పిల్లులను బలి ఇస్తే అద్భుత శక్తులు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయనే మూఢ నమ్మకం నేపథ్యంలో ఈ కథను నడిపించారు.

ఈ మూఢ నమ్మకం వెనకున్న ప్రతి చిన్న అంశాన్ని డీటైయిల్డ్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ తరహా సినిమాల్లో ఉండాల్సిన  సస్పెన్స్, స్పీడు ఇందులో లోపించాయి. ఏదేమైనా, అత్యాశ, మూఢ నమ్మకాలను మించి మనిషిని పీడించే పెద్ద దెయ్యం మరొకటి ఉండదని దర్శకుడు ఈ చిత్రంతో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ వీకెండ్ క్షుద్ర పూజలు, తాంత్రిక విద్యలు, పిల్లి మాయతో వచ్చిన ‘హనీ’తో ఆడియన్స్ భయపడాల్సిందే.. 

‘హనీ’ కథగా:

ఆనంద్ (నవీన్ చంద్ర) ఓ మిడిల్ క్లాస్ మ్యాన్. కోట్లు సంపాదించాలనే అత్యాశతో మూఢ నమ్మకాలు, క్షుద్ర పూజల వైపు ఆకర్షితుడవుతాడు. దీంతో ఉన్న ఉద్యోగం పోతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య లలిత (దివ్య పిళ్లై) టీచర్‌‌గా పనిచేస్తూ ఫ్యామిలీని పోషిస్తుంటుంది. కూతురు మీరా (బేబీ జయన్నీ) అశుభ గడియల్లో పుట్టిందని ఈసడించుకుంటాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు సారంగపాణి (రాజా రవీంద్ర)తో కలిసి క్షుద్ర ప్రయోగాలు చేస్తుంటాడు.

అందుకు ఓ చిన్నారి అవసరం. తన కూతురునే ఫణంగా పెడతాడు ఆనంద్. ఓ క్షుద్ర ప్రయోగం ఫలించి డబ్బు రావడంతో కూతురు ఆరోగ్యం క్షీణిస్తున్నా డబ్బుపై ఆశతో అదేదారిలో ముందుకెళ్తుంటాడు. ఇందుకోసం భార్యను గదిలో బంధించి అనారోగ్యం పాలు చేస్తాడు. అతని క్షుద్ర ప్రయోగాల కారణంగా ‘హనీ’ అనే అదృశ్య శక్తితో మీరా మాట్లాడుతుంటుంది.

అసలు ఆ హనీ ఎవరు..? ఆనంద్ క్షుద్ర పూజలు ఆ కుటుంబాన్ని ఏం చేశాయి..? అతని పిచ్చి నమ్మకాలతో తల్లి, కూతురు ఎలాంటి నరకంగా అనుభవించారు..? అతని చెర నుంచి ఎలా బయటపడ్డారు..? ఇందులో రమణ (దివి) పాత్ర ఏమిటి.. అనేది అసలు కథ.