ఆకలి తీరట్లే.! ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. రూ.5 మీల్స్ క్యాంటీన్ల ఏర్పాటులో నిర్లక్ష్యం..

ఆకలి తీరట్లే.! ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. రూ.5 మీల్స్ క్యాంటీన్ల ఏర్పాటులో నిర్లక్ష్యం..
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతిపాదించినవి 21., ఏర్పాటైనవి 4 
  • బియ్యం రేట్లు పెరగడంతో పేదల కోసం ఏర్పాటు చేయాలంటున్న సామాజిక కార్యకర్తలు

కరీంనగర్, వెలుగు: పట్టణాల్లో పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రూ.5 భోజనం క్యాంటీన్ల ఏర్పాటులో బల్దియాల పాలకవర్గాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 21 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రతిపాదించగా 4 మాత్రమే కొనసాగుతున్నాయి. 

క్షేత్రస్థాయిలో ఆఫీసర్లు, పాలకవర్గాల పట్టింపులేనితనంతో ఈ స్కీమ్​ ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదు. ఎల్ నినో నేపథ్యంలో మార్కెట్లో బియ్యం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో పేదల కోసం రూ.5 భోజనం క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడు.. రామగుండంలో నిల్

మున్సిపాలిటీల పరిధిలో ప్రతి 50 వేల జనాభాకు ఒక క్యాంటీన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ లెక్కన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో 6 క్యాంటీన్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ప్రస్తుతం కళాభారతి, లైబ్రరీ, సివిల్ ఆస్పత్రి వద్ద కలిపి 3 మాత్రమే నిర్వహిస్తున్నారు. నాకా చౌరస్తా జంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ఏడాది కింద తీర్మానించినప్పటికీ, ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు.

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 5 క్యాంటీన్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఒక్కటి కూడా అందుబాటులో లేదు. సిరిసిల్లలో రెండు క్యాంటీన్లకు గాను ఒకటి మాత్రమే కొనసాగుతోంది. వేములవాడలో ఒక్క క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయలేదు. జగిత్యాలలో రెండు క్యాంటీన్లకు ఒక్కటీ అందుబాటులోకి రాలేదు. జమ్మికుంట, హుజూరాబాద్, కోరుట్ల, మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, పెద్దపల్లి పట్టణాల్లోనూ అన్నపూర్ణ క్యాంటీన్ల ఏర్పాటు జరగలేదు. నిధుల కొరతను సాకుగా చూపుతూ పాలకవర్గాలు కాలయాపన చేస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పేదల ఆకలి తీర్చాలి.. 

ఎల్ నినో నేపథ్యంలో మార్కెట్ లో బియ్యం ధరలు చుక్కలనంటుతున్నాయి. ముఖ్యంగా దినసరికూలీలు, ఆటోకార్మికులు, ఫుట్ పాత్ పై జీవనం సాగించే పేదలు భోజనం చేసే పరిస్థితి లేదు. వివిధ పనులపై పట్టణాలకు వచ్చేవారు కూడా హోటళ్లలో భోజనం చేయాలంటే రూ.100కు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో రూ.5 భోజనం క్యాంటీన్లను విస్తరించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి.

- ఎండీ షాబుద్దీన్, 
సామాజిక కార్యకర్త, కరీంనగర్